మనం తీసుకునే ఆహారమే మన శరీరంపై ప్రభావం చూపిస్తుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పోషకాలు, విటమిన్లు కలిగిన ఆహారం తీసుకోవడం ఉత్తమం అంటున్నారు. మరి అవేంటో తెలుసుకుని పాటిస్తూ.. ఒత్తిడి, ఆందోళన లేని ఆరోగ్యాన్ని సంపాదించుకుందాం..
ఆహారంలో మార్పులతో ఆందోళనకు చెక్!
యాంగ్జైటీ, మానసిక ఒత్తిడి వల్ల శరీరంలో ఎక్కువ మొత్తంలో కార్టిసాల్ హార్మోన్ విడుదలవుతుంది. దీనివల్ల ఆకలి పెరగడం, అధిక బరువు, మధుమేహం లాంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఈ క్రమంలో యాంగ్జైటీ, ఒత్తిడి లాంటి సమస్యలకు ప్రారంభంలోనే చెక్ పెట్టాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో భాగంగా రోజూ తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. మరి వారు చెబుతున్నట్లు యాంగ్జైటీ, ఒత్తిడి లాంటి సమస్యల నుంచి బయటపడాలంటే మన డైట్‌ను ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం రండి..
విటమిన్-డి
విటమిన్-డి లోపం వల్ల యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటి మానసిక ఆరోగ్య సమస్యలు అధికంగా వచ్చే అవకాశముందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే సరిపడినంత విటమిన్-డి పొందడం ఎంతో అవసరం. ఇందుకోసం పాలు, పెరుగు, చేపలు, గుడ్డులోని పచ్చసొన, పుట్టగొడుగులు, మాంసం, చిలగడదుంప, అవకాడో... వంటి పదార్థాల్ని రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు విటమిన్లు-బి, సి అధికంగా లభించే పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి శరీరంలో కార్టిసాల్ స్థాయులను తగ్గించి యాంగ్జైటీ, ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు
మెదడు పనితీరును మెరుగుపరచడంతో పాటు చర్మం, కురుల సంరక్షణలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఈ పోషకాలు పుష్కలంగా ఉండే చేపలను అధికంగా తీసుకోవాలంటారు పోషకాహార నిపుణులు. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు యాంగ్జైటీ, ఒత్తిడి లాంటి సమస్యలను కూడా బాగా తగ్గిస్తాయి. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలతో పాటు కొన్ని రకాల ఆమ్లాలు శరీరంలోని కార్టిసోల్ ఉత్పత్తిని నియంత్రిస్తాయి. కాబట్టి సాల్మన్, ట్రౌట్ వంటి చేపలతో పాటు ఇతర సీ ఫుడ్‌ను డైట్‌లో భాగం చేసుకుంటే యాంగ్జైటీ సమస్య నుంచి బయటపడచ్చు. ఇక మీరు వెజిటేరియన్ లేదా వీగన్ అయితే వాల్‌నట్స్, గుమ్మడికాయ గింజలు, సబ్జా గింజలు, అవిసె గింజలను ఆహారంలో భాగం చేసుకోవడం మేలు.
పసుపు
సహజమైన యాంటీ బయోటిక్‌గా పనిచేసే పసుపులో కర్క్యుమిన్ అనే రసాయన పదార్థం అధికంగా ఉంటుంది. ఇది యాంగ్జైటీ తీవ్రతను బాగా తగ్గిస్తుంది. దీంతో పాటు స్ట్రెస్, అల్జీమర్స్, పార్కిన్సన్, డిప్రెషన్‌ల తీవ్రతను తగ్గించడంలోనూ పసుపు ప్రభావవంతంగా పని చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్ వద్దు!
ప్రస్తుత రోజుల్లో బరువు తగ్గేందుకు చాలామంది ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్ ను వాడుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని క్యాలరీలు కరిగి స్లిమ్‌గా మారతామన్న అభిప్రాయమే అందుకు కారణం. అయితే చక్కెరతో పాటు కొవ్వుల శాతం అధికంగా ఉండే వీటిని వాడటం మానసిక ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇవి శరీరంలో హ్యాపీ హార్మోన్లుగా పేరొందిన డోపమైన్, సెరటోనిన్‌ల ఉత్పత్తిని అడ్డుకుంటాయి. ఫలితంగా యాంగ్జైటీ, ఒత్తిడి, డిప్రెషన్ లాంటి సమస్యలు అధికమవుతాయి. ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్ ను అధికంగా తీసుకుంటే జీవక్రియల రేటు మందగించడమే కాకుండా న్యూరోట్రాన్స్ మిటర్ల ఉత్పత్తిలో పలు మార్పులు కలుగుతాయి. ఇవి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.
గ్లూటెన్‌ను తగ్గించాల్సిందే!
పలు జీర్ణ సంబంధ సమస్యలకు కారణమయ్యే గ్లూటెన్ మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే గ్లూటెన్ అధికంగా ఉండే బీర్, బ్రెడ్, గోధుమలు, పాస్తా, బిస్కెట్లు, చాక్లెట్లు, ప్రాసెస్డ్ ఫుడ్స్‌కు ఎంత దూరంగా ఉంటే అంతమంచిది. వీటికి బదులు ఓట్స్, రాగులు, రైస్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు.
కీటో డైట్‌ను ట్రై చేయండి!
త్వరగా బరువు తగ్గేందుకు ప్రస్తుతం చాలామంది కీటో డైట్‌ను ఫాలో అవుతున్నారు. అయితే యాంగ్జైటీతో పాటు డిప్రెషన్, పార్కిన్సన్, ఏడీహెచ్‌డీ (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్) వంటి మానసిక సమస్యలకు కూడా కీటో డైట్ మంచిదని నిపుణులు చెబుతున్నారు. చేపలు, మాంసం, కూరగాయల ద్వారా అతి తక్కువ మొత్తంలో కార్బొహైడ్రేట్లు తీసుకుని బరువు తగ్గడమే ఈ కీటోడైట్ విధానం. అయితే షుగర్, కిడ్నీ సంబంధ సమస్యలున్నవారు ఈ డైట్‌ను పాటించేముందు వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
వీటితో పాటు ఐరన్, మెగ్నీషియం, ప్రొటీన్లు, క్యాల్షియం, సెలీనియం, విటమిన్-ఇ పోషకాలు అత్యధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే అకారణమైన ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్ లాంటి సమస్యలు తగ్గిపోతాయి. మరి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే మీ డైట్‌లో వీటిని చేర్చుకోండి!
ఇదీ చదవండి: రోజుకి ఎన్నిసార్లు బ్రష్ చేసుకోవాలి? ఎంతసేపు తోముకోవాలి?