కొంతమంది ఎప్పుడు చూసినా కోపంతో ఊగిపోతుంటారు. అలాంటి వాళ్లతో ఏం మాట్లాడాలన్నా భయమే. వారితో మాట్లాడడానికి అంత తొందరగా ఎవరూ ముందుకురారు. ఇలా ఎప్పుడూ కోపంగా ఉండడం వల్ల జీవితంలో సంతోషాన్ని పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. దానికి సరైన మందు ధ్యానం. ఇది చేయడం వల్ల మనపై మనకు ఉండే అపనమ్మకాలు, అపోహలు అన్నీ తొలగిపోయి పూర్తి విశ్వాసం కలుగుతుంది. దీంతో ఎప్పుడూ మనం నవ్వుతూ ఉండడమే కాకుండా అందరినీ నవ్విస్తూ ఉండచ్చు.
ఒత్తిడి తగ్గుతుంది..
రోజుకు కనీసం ఇరవై నిమిషాల పాటు ధ్యానం చేస్తే ఒత్తిడి వల్ల మెదడులో కలిగే భావోద్వేగాలు నియంత్రితమై తద్వారా నాడీవ్యవస్థ పనితీరు మెరుగవుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనివల్ల ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఫలితంగా రాత్రుళ్లు సుఖంగా నిద్ర కూడా పడుతుంది.
అలవాట్లలో మార్పులు..
ధ్యానం చేయడం వల్ల రోజువారీ అలవాట్లలో కూడా మార్పులొస్తాయట. అదెలాగంటే.. ఆహారంలో భాగంగా ఏది పడితే అది (జంక్ ఫుడ్స్) తినేయడం, పనిపై శ్రద్ధ పెట్టకపోవడం, బద్ధకం.. ఇలాంటి దురలవాట్లు మానేసి మంచి అలవాట్లను అలవర్చుకునే అవకాశాలున్నాయంటున్నారు మానసిక నిపుణులు. ధ్యానం చేయడం వల్ల మంచి పోషకాలున్న ఆహారం తీసుకోవడంపైకి మనసు మళ్లడంతో పాటు చురుగ్గా తయారయ్యే అవకాశం కూడా ఉంటుందని నిపుణుల అభిప్రాయం.
ఏకాగ్రత పొందడానికి..
మనం చాలా సినిమాల్లో చూస్తూనే ఉంటాం.. బాక్సింగ్ చేసేటప్పుడు వాళ్ల ఏకాగ్రత నశించి ఎదుటి వ్యక్తిని ఎదుర్కోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తిరిగి శక్తి పొందడానికి బ్రేక్‌టైమ్‌లో ధ్యానం చేయమని చెబుతుంటారు కోచ్‌లు. దీనికే కాదు.. ఏ పనిలో విజయం సాధించాలన్నా దానిపై ఏకాగ్రత నిలపడం చాలా ముఖ్యం. మరి ఇలాంటి ఏకాగ్రత, పనులు పూర్తి చేయడానికి ఉండాల్సిన సామర్థ్యం, సృజనాత్మకత సొంతం కావాలంటే రోజూ ధ్యానం చేయడం మంచిదంటున్నారు నిపుణులు.
నొప్పి నుంచి ఉపశమనం..
అలాగే ధ్యానం చేయడం వల్ల వివిధ గాయాల వల్ల కలిగే నొప్పుల తీవ్రత దాదాపు 40 శాతం వరకు, నొప్పుల వల్ల కలిగే అసౌకర్యం దాదాపు 57 శాతం వరకు తగ్గుతుందని ఓ పరిశోధనలో తేలింది. అంతేకాదు.. తలనొప్పి, ఇతర శారీరక నొప్పులు వంటివి కూడా ఈ ధ్యానంతో దూరం చేసుకోవచ్చు.
ఆరోగ్యానికీ.. అందానికీ..!
ధ్యానం చేయడం వల్ల ప్రశాంతత సొంతమవుతుంది. తద్వారా శరీరంలోని రక్తనాళాల్లో రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఫలితంగా రక్తపోటు అదుపులో ఉండి గుండె కూడా సురక్షితంగా ఉంటుంది. అలాగే రోగనిరోధక శక్తి మెరుగవడంతో పాటు శ్వాసవ్యవస్థ కూడా పటిష్టంగా ఉంటుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. వీటితో పాటు ధ్యానం వల్ల చర్మంపై వృద్ధాప్య ఛాయలు ఏర్పడకుండా నవయవ్వనంగా ఉండచ్చన్నది నిపుణుల అభిప్రాయం.
చూశారుగా.. ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలేంటో..! మరి ఇవన్నీ చదువుతుంటే మీకు కూడా వెంటనే ధ్యానం మొదలుపెట్టేయాలనుందా.. అయితే ఇంకెందుకాలస్యం.. ప్రొసీడ్..!
ఇదీ చూడండి: ఎండ ముప్పు నుంచి.. ఇదో చల్లటి ఉపశమనం!!