మాది హైదరాబాద్. అమ్మ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. నాన్న ప్రయివేటు ఉద్యోగి. ఓ తమ్ముడు. నేను 2014లో వరంగల్ ఎన్‌ఐటీ నుంచి ఈఈఈ పూర్తిచేశా. కళాశాలలో ఉన్నప్పుడే అంకుర సంస్థలో పనిచేయాలనుకున్నా. పెద్ద కంపెనీల్లో అయితే మన పాత్ర పరిమితంగా ఉంటుంది. అదే స్టార్టప్‌లో అయితే స్వేచ్ఛగా పనిచేసి విజయాలు సాధించవచ్చని నా నమ్మకం. ఇంజినీరింగ్ మూడో సంవత్సరంలో ఉండగా మద్రాసు ఐఐటీకి ఇంటర్న్‌షిప్ కోసం వెళ్లా. అక్కడే ఇప్పటి మా సహవ్యవస్థాపకులు సాయిప్రశాంత్, అజయ్ యతీంద్ర పరిచయం అయ్యారు. వారికీ స్టార్టప్ సంకల్పం ఉండటంతో మా ఆలోచనలు కలిశాయి. అప్పటికే వాళ్లు ‘కంజూమెక్స్ ఇండస్ట్రీస్’ అనే స్టార్టప్‌ను రిజిస్టర్ చేశారు. కానీ పెద్దగా కార్యకలాపాలు లేవు. ఇంజినీరింగ్ అయ్యాక 2015లో నేను అందులో భాగస్వామినయ్యా. ఐఐటీ మద్రాసులో మా సంస్థ ప్రయాణం మొదలైంది.
70 దేశాల నుంచి...
మొదట చెన్నై, తర్వాత బెంగళూరుకు కార్యాలయాన్ని మార్చి స్టార్టప్ ప్రొడక్ట్‌పై దృష్టి పెట్టాం. ఏళ్లు గడుస్తున్నా అధైర్యపడలేదు. అలా 2018లో ఒక స్మార్ట్ వాచ్‌ను రూపొందించాం. కార్డు లేకుండా దాని ద్వారా డబ్బులు చెల్లించొచ్చు. వ్యాయామం చేస్తే కరిగిన కెలొరీల వివరాలు, ఫిట్నెస్‌కు సంబంధించిన వివరాలూ అందులో ఉంటాయి. మా ఉత్పత్తికి మంచి డిమాండ్ వచ్చింది. అమెరికా, యుకే, ఆస్ట్రేలియా, ఇటలీ, కెనడాతోపాటు మొత్తంగా 70 దేశాల నుంచి ఆర్డర్లు వచ్చాయి. వ్యాపారం పుంజుకుంటున్న తరుణంలో కరోనా దెబ్బతో చాలా దేశాలు లాక్‌డౌన్ అయ్యాయి. మార్కెట్లో అమ్మకాలు లేవు, మాకు పనిలేక ఇంటికే పరిమితమవ్వాల్సి వచ్చింది. ఈ ప్రతికూల పరిస్థితుల నుంచే మాకో సరికొత్త ఆలోచన వచ్చింది. బయట కరోనా సోకిన వారిలో కొందరికి లక్షణాలు తెలియడం లేదు. కొవిడ్ లక్షణాలను పసిగట్టే ఓ స్మార్ట్ ట్రాకర్‌ను చేయాలనుకున్నాం. పాత వాచ్‌కు కొనసాగింపుగా కొవిడ్ ట్రాకర్‌ను చేశాం.
ఇట్టే పసిగట్టేస్తుంది..
ఈ కొవిడ్ ట్రాకర్ తయారు చేయడానికి 75 రోజులు కష్టపడ్డాం. ఈ ట్రాకర్‌ను చేతికి ధరిస్తే.. శరీరంలోని ఆక్సిజన్ లెవెల్స్‌ను తెలియజేస్తుంది. శరీర ఉష్ణోగ్రత, గుండె లయ తదితర వివరాలు ‘మ్యూస్ హెల్త్’ యాప్‌కు వస్తాయి. యాప్‌ను స్మార్ట్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు. చాలామందిలో కొవిడ్ లక్షణాలు కనిపించడం లేదు. కానీ శరీరంలో ఆక్సిజన్ లెవల్ పడిపోతుండడంతో పరిస్థితి విషమిస్తోంది. ఈ ట్రాకర్ ధరిస్తే కొవిడ్ ఉండి.. లక్షణాలు లేని వారికి కూడా ఆక్సిజన్ స్థాయి తగ్గితే మొబైల్‌కు అలర్ట్ వస్తుంది. ఈ ట్రాకర్ వ్యక్తిగతంగా వినియోగించేందుకే కాకుండా ఆసుపత్రులు, సంస్థలు భారీ సంఖ్యలో వినియోగిస్తే.. వారు ఏర్పాటు చేసే ఒక డాష్‌బోర్డుకే అందరి వివరాలు వచ్చేలా తీర్చిదిద్దాం. కచ్చితమైన ఫలితాలు రావడానికి ఇప్పటికే ఎంతో మంది నమూనాలు సరిచూశాం. ఈ ఆలోచనకు కిమ్స్ ఆసుపత్రుల నుంచి 22 కోట్ల రూపాయల ఫండింగ్ అందింది. వచ్చేనెల మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాం. గతేడాది దక్షిణ కొరియా నుంచి మహిళా ఆంత్రప్రెన్యూర్ పురస్కారం అందుకున్నాను.
ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 2,083 కరోనా పాజిటివ్ కేసులు