'మాకోసం ఒక్క పాట పాడండి మేడమ్...' 'మా ఫ్రెండ్‌కి పుట్టినరోజు విషెస్ చెప్పండి మేడమ్...' అని కోరే అభిమానులని నిరాశపరచలేదు చిన్మయి. ''కొవిడ్ వేళ ఇబ్బందుల్లో ఉన్నవారికి విరాళాలు ఇస్తే పాడతా''నంటూ అభిమానులకూ సాయం చేసే అవకాశం కల్పించింది. అభిమానుల కోసం పాటలు పాడుతూ, విషెస్ చెబుతూ... కొవిడ్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి రూ. 85 లక్షలను అందించింది.
‘కొన్నిరోజుల క్రితం తమిళనాడుకు చెందిన బధిరుల స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఒకాయన వచ్చి తన దగ్గరున్న విద్యార్థులకు సాయం చేయాల్సిందిగా కోరాడు. ఆరాతీస్తే.. పాపం ఆ పిల్లల తల్లిదండ్రులంతా కూలీపనులకు వెళ్లేవాళ్లే. వాళ్ల కోసమే ఈ పని మొదలుపెట్టాను. గత కొన్ని నెలలుగా నేను వ్యక్తిగతంగా పాటల్ని అంకితం చేయడం, శుభాకాంక్షలు చెప్పడం చేస్తున్నా. ఇలా మొత్తం మూడువేల వీడియోలు చేశాను. అభిమానుల నుంచి వచ్చిన విరాళాలని అవసరంలో ఉన్నవారికి నేరుగా వారి ఖాతాలకే చేరేలా చూస్తున్నా. ఎవరికి తోచినంత వాళ్లు అందించారు. ఒక ఎన్నారై అయితే లక్షన్నర రూపాయలని విరాళంగా అందించారు. మనుషుల్లో ఇంకా మంచితనం, మానవత్వం మిగిలే ఉందని చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి అంటోంది’ చిన్మయి.
ఇదీ చూడండి: 70వ వసంతంలోకి అడుగుపెట్టిన ప్రధాని మోదీ