అత్యంత ప్రమాదకర నిఫా వైరస్‌ని మాత్రమే కాదు... కొవిడ్‌ని కట్టడి చేయడంలోనూ కేరళ ప్రభుత్వం అనుసరించిన ఎన్నో ప్రయోగాత్మక పద్ధతులు దేశానికి దిశానిర్దేశం చేశాయి. ముఖ్యంగా కేరళ ఆరోగ్యశాఖ మంత్రిగా చేసిన కె.కె.శైలజని ప్రపంచం మొత్తం ప్రశంసించింది. ఎన్నికల అనంతరం.. ఎన్నో బాధ్యతలు, అంచనాలున్న ఆరోగ్యశాఖని వీణాజార్జ్‌కి అప్పగించింది కేరళ కొత్త ప్రభుత్వం.
శైలజ మాదిరిగానే వీణ కూడా తన కెరీర్‌ని ఉపాధ్యాయినిగానే మొదలుపెట్టారు. 45 ఏళ్లు. ఆమె స్వస్థలం తిరువనంతపురం. తండ్రి పీవీ కురియకోస్ న్యాయవాది. అమ్మ రోజమ్మ కురియకోస్.. మున్సిపల్ కౌన్సిలర్‌గా పనిచేశారు. ఎమ్మెస్సీ ఫిజిక్స్, బీఈడీ చేసిన వీణ.. చదువుకుంటూనే ఎస్‌ఎఫ్‌ఐ వంటి విద్యార్థి సంఘాల కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. పథనంతిట్ట జిల్లాలోని కెథోలికేట్ కాలేజీలో ఏడాదిన్నర లెక్చరర్‌గా పనిచేశారు. ఒక అధ్యాపకురాలిగా కన్నా... సమస్యలపై పోరాడి పరిష్కారం చూపించే విలేకరిగా మారడంలో సంతోషాన్ని వెతుక్కున్నారామె. అయితే జర్నలిజంలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో ఆమె అనుకున్నట్టుగా లేదు. అంతగా ప్రాధాన్యం లేని వార్తల్ని రాయమనడం... అమ్మాయిల్ని చిన్నచూపు చూడ్డం తనకి నచ్చలేదు.
అపారమైన అనుభవంతో
‘ఆడపిల్లవి కదా... ఈ వార్తని కవర్ చేయగలవా? పోనీ మగవాళ్ల సాయం తీసుకుంటావా?’ వంటి మాటలు ఆమెలో పట్టుదలని రేపాయి. క్లిష్టమైన, కష్టసాధ్యమైన అసైన్‌మెంట్లని మాత్రమే తీసుకుని తానేంటో నిరూపించుకోవడం మొదలుపెట్టిన వీణ కైరళిటీవి, మనోరమ.. వంటి చోట్ల పనిచేశారు. 2012లో అమెరికా ఎన్నికలు కవర్ చేయడానికి మన దేశం నుంచి వెళ్లిన ఐదుగురు జర్నలిస్టుల్లో ఆమె ఒకరు కావడం విశేషం. నార్త్ అమెరికన్ ప్రెస్‌క్లబ్ అవార్డు, యూఏఈ గ్రీన్ ఛాయిస్ అవార్డులని అందుకున్నారు. ఒక టీవీ ఛానెల్‌కి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ హోదాకి చేరుకున్నారు. ఇంతవరకూ ఏ మహిళా ఆ స్థానానికి చేరుకోకపోవడం విశేషం. ‘ఏ పనైనా కష్టంగా ఉంటుందేమో కానీ అసాధ్యం అయితే కాదు’ అంటారు వీణ. అలా జర్నలిజంలో 16 ఏళ్ల అపారమైన అనుభవం సాధించిన తర్వాత మరో అడుగు ముందుకేసి రాజకీయాల్లో అడుగుపెట్టారు. తొలిసారి అరణ్‌మూలమ్ నియోజకవర్గం నుంచి పోటీచేసి కాంగ్రెస్ నాయకుడు శివదాసన్‌పై విజయం సాధించారు. అలా తొలిసారి విలేకరి నుంచి నేతగా ఎదిగిన మహిళగా గుర్తింపు అందుకున్నారు. రెండోసారి కూడా శివదాసన్‌పై అధిక మెజారిటీతో గెలుపొంది, ఆరోగ్యశాఖమంత్రిగా బాధ్యతలు తీసుకోనున్నారు. భర్త డాక్టర్ జార్జ్ జోసెఫ్ ఒక కాలేజీలో లెక్చరర్. ఆమెకి ఇద్దరు పిల్లలు. ఒక పాప... బాబు.
ఇదీ చూడండి: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల బాధ్యతల స్వీకరణ