అది బెంగళూరు మహానగర శివార్లలోని కోరమంగళ ప్రాంతంలో టెక్కీ గణపతి ఆలయం. సాఫ్ట్‌వేర్ కంపెనీల నడుమ ఈ ఆలయం ఉండడం వల్ల దానికి టెక్కీ గణపతి ఆలయమనే పేరు వచ్చింది. పేరుకు తగ్గట్టే ఈ ఆలయం ఆధునిక, సంప్రదాయ రీతిలో ఉంది. సాధారణంగా గణపతి విగ్రహాలలో తొండం ఎడమవైపునకి తిరిగి ఉంటుంది. అది వరసిద్ధి వినాయకుని రూపం. అందుకు భిన్నంగా టెక్కీ గణపతి గర్భాలయంలో కుడివైపునకి తిరిగిన తొండంతో మూలవిరాట్టు ఏర్పాటైంది. ఈ క్షిప్రగణపతి వెంటనే కోరికలు తీరుస్తాడని ముద్గల పురాణంలో ఉంది. ముగ్ధమనోహర సౌందర్య రసోపేత మూర్తిగా కోరిన వరాలనిచ్చే దేవరగా ఈ టెక్కీ గణపతి విగ్రహం అలరిస్తుంది.
నలభై ఏళ్ల క్రితం నిర్మితమైన ఈ ఆలయ ప్రవేశద్వారం మూడు అంతరువుల రాజగోపురం బహుశిల్పాకృతులతో ఆకట్టుకుంటుంది. గోపురాలు, విమానశిఖరాలు, ప్రాకారాలు, ఆలయంలోని ప్రధాన ఉపమందిర విగ్రహాలు కళామయంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. బెంగళూరులో ఈ ఆలయం విశిష్టస్థలిగా పేరొందింది. పంచలోహ యుక్తమైన ధ్వజస్తంభం, దానికి నలువైపుల గణేశ ఆకృతులు, ప్రాకారాలపై శివుడు, పార్వతి, సుబ్రహ్మణ్యస్వామి ఆకృతులు భాసిల్లుతున్నాయి. ఇదే ఆలయ ఆవరణలో బంగారు తొడుగులతో ప్రకాశించే మహాలింగస్వరూపునికి, కరుణాకటాక్షాలతో ప్రసన్న పార్వతీదేవికి ఉపాలయాలున్నాయి. అమ్మవారు పంచలోహ కవచంతో, రజిత తోరణం కింద నిలుచున్న భంగిమలో ఉంటుంది. ఆ పక్కనే శివపార్వతుల రెండో తనయుడైన కుమారస్వామికి మరో ఉపాలయముంది. బెంగళూరు మెజెస్టిక్ రైల్వేస్టేషన్ నుంచి పావుగంటలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు.
ఇదీ చూడండి: Afghanistan news: 'ఏం చేస్తావ్? చంపుతావా? ఏదీ చంపు'