ఆకృతి
‘దరహాసోజ్జ్వలన్ముఖి’ అయిన ఆ తల్లి చిరునవ్వుతో, ప్రసన్న వదనంతో భక్తులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. తన వారికి రక్షణ అవసరమైనప్పుడు అంతటి శాంతమూర్తీ... చండికగా మారి శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తుంది. శరీరమంతా నీలవర్ణాన్ని ఆవేశింప చేసుకుని అపరకాళికగా పోరాడుతుంది.
కరుణ, వాత్సల్యం, ప్రేమతో తొణికిసలాడే ఆ కళ్లు అహంకారాన్ని, దానవత్వాన్ని, నిరంకుశత్వాన్ని దునుమాడే సమయంలో అంతులేని క్రోధం, కాఠిన్యం, ఉగ్రతతో నిండిపోతాయి. ప్రతి స్త్రీ జగదంబ ఆకృతిని ఆదర్శంగా తీసుకోవాలి. హితుల పట్ల ప్రేమ, శాంతి మార్గాలను అవలంబిస్తూనే తనను ఇబ్బందులకు గురిచేయాలనుకునే వారిని ఏ మాత్రం ఉపేక్షించని కచ్చితమైన వ్యవహారశైలిని అలవరించుకోవాలి. శ్రీరామచంద్రమూర్తి అంతటి వాడు కూడా పరిస్థితులను అదుపులో ఉంచడానికి కోపాన్ని సాధనంగా ఉపయోగించాడు. కాబట్టి ముఖకవళికలు, ఆహార్యం, చూపులు మొదలైనవన్నీ మన వ్యక్తిత్వాన్ని, భావాలను సుస్పష్టంగా ప్రకటించే శక్తులుగా సద్వినియోగం చేసుకోవాలి. సమయస్ఫూర్తితో సాగిపోవాలి.
వాహనం
శ్రీరాజరాజేశ్వరి సింహాన్ని అధిరోహించి, ధీరసనుంచిత దివ్య మంగళమూర్తిగా అభయాన్నిస్తూ అనుగ్రహిస్తుంది. ఆ తల్లి వాహనమైన సింహం విభిన్న కోణాలలో మనకు ఆదర్శం. అడవిలో ఎన్ని మృగాలు ఉన్నా మృగరాజు సింహమే. నాయకత్వ లక్షణాలు, నడకలో రాజసం, కళ్లలో నిర్భీతి, సమూహాన్ని నడిపించగలిగే సామర్థ్యం, ఒంటరిగా బతకగలిగే ధైర్యం, తన కన్నా బలమైన శత్రువుతోనైనా తలపడగలిగే సాహసం, సరైన సమయంలో శక్తి యుక్తులను ప్రయోగించడం ఇవన్నీ సింహం ప్రత్యేకతలు.
ఈ లక్షణాలను మనం తప్పక అలవరచుకోవాలి. నడవడికలో హుందాతనం, నిర్భీతి, సాహసం, అందరినీ కలుపుకొని సాగే విశాల హృదయం, గౌరవానికి భంగం కలిగినప్పుడు ఒంటరిగా అయినా పోరాడే తెగింపు... ఇవన్నీ బతుకుబాటకు కాగడాలు. ఆ దివిటీల వెలుతురులో పయనిస్తూ జగత్కల్యాణ కాంతితో లక్ష్యాన్ని చేరుకుందాం.
‘‘అమ్మ బాహ్యాకృతి అతివల అంతరంగ ఉన్నతికి ప్రకృతి’’
ఆయుధాలు
‘ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః’, ‘శూలాద్యాయుధ సంపన్నా’, ‘ఖట్వాంగాది ప్రహరణా’ అని స్తోత్రరత్నాల్లో, పురాణాల్లో అమ్మవారి ఆయుధ ప్రస్తావన కనిపిస్తుంది. పాశం, అంకుశం, ధనుర్బాణాలు, శంఖం, చక్రం, త్రిశూలం, గద, వజ్రాయుధం, కత్తి, డాలు ఇలా అనేక ఆయుధాలు ఆ స్థితికారిణి వివిధ సందర్భాల్లో ప్రయోగించింది. ఈ ఆయుధాల స్ఫూర్తిని మనం ఆత్మరక్షణ విషయంలో కూడా పుణికిపుచ్చుకోవాలి.
శంఖం: శంఖధ్వని ధ్యేయం విషయాన్ని ప్రపంచానికి తెలియజేయడం. ఈ రోజుల్లో, అనేక రంగాల్లో కాలూని, క్లిష్టమైన బాధ్యతలను నిర్వర్తిస్తూ... వివిధ మనస్తత్వాలున్న వ్యక్తుల మధ్య జీవనం సాగిస్తున్నారు మహిళలు. తమ సమస్యలు, అనుకూల, ప్రతికూలాంశాలు, చేదు అనుభవాలను ఎప్పటికప్పుడు శంఖధ్వనిలా సమాజానికి తెలియజేయాలి. ఆ ఇబ్బందులకు బాధ్యులైన వారి గురించి నోరు తెరిచి వెల్లడించడం ఆత్మరక్షణకు పునాది అని ప్రతి వనితా గ్రహించాలి.
చక్రం: అడ్డుకోవడం, అడ్డుతొలగించడం చక్రం లక్షణాలు. మాటలకు చేతలను జోడించి సమస్యను అడ్డుకోవడం ఆరంభించాలి. ‘కలౌ సంఘే శక్తిః’ అన్నట్లు... చక్రం గుండ్రంగా అన్ని వైపులకు తిరిగినట్లు... తన చుట్టూ ఉన్న వారి శక్తులను ఉపయోగించుకుని సమస్యను అడ్డు తొలగించగలిగే నేర్పును అలవాటు చేసుకోవాలి.
పాశం: అంటే బంధం. అది ఎప్పుడూ ఆలంబనగా ఉంటూ బలం కావాలి. అదే బంధనంగా మారి బలహీనత అవ్వకూడదు. స్త్రీ ఉన్నత శిఖరాలను అధిరోహించే క్రమంలో బంధాలను బలంగా మార్చుకోగలగాలి. ఆ దృఢత్వాన్ని సాధించడానికి, దాన్ని ఆలంబనగా చేసుకోడానికి ఎంతో ఓర్పు కావాలనే సందేశాన్నిస్తుంది పాశం.
అంకుశం: పదునైన మొన ఉండే ఆయుధం. అంత పెద్ద మదపుటేనుగు కూడా మావటి చేతి చిన్న అంకుశానికి లొంగి ఉన్నట్లు ఒక్కోసారి ఎంతటి జటిల సమస్య అయినా బుద్ధికి పదును పెట్టి, యుక్తితో సులభంగా పరిష్కరించుకోవచ్చు. ఆ యుక్తే అంకుశం.
ఇలా అమ్మ ఆయుధాల అంతరార్థాల్ని గ్రహించి, ఆత్మరక్షణకు, ఆత్మసంస్కరణకు అన్వయం చేసుకుంటూ విజయాలను అందుకోవాలి.