ETV Bharat / lifestyle

సూర్యుడికి పల్లెసీమలు సమర్పించే కృతజ్ఞతాంజలి.. సంక్రాంతి

అలసిపోడు... ఆగిపోడు... వెనుదిరిగి చూడడు... వేచి ఉండడు... దినకరుడు నిరంతర సంచారి. యుగయుగాలుగా సాగుతున్న ఆయన ప్రయాణమే సకల చరాచర జగత్తుకు జీవనాధారం. ఆ దివ్య కిరణస్పర్శతో ప్రాణికోటి చైతన్యవంతమవుతుంది. ప్రకృతి పరవశిస్తుంది. మెండుగా పంటలు పండి, గాదెలు నిండి పల్లెసీమలన్నీ పౌష్యలక్ష్మికి సంతోషంగా స్వాగతం పలుకుతూ జరుపుకునే సంక్రాంతి పండుగ ఆ సూర్యభగవానుడికి మనిషి సమర్పించే కృతజ్ఞతాంజలి కూడా.

etvbharat-special-story-on-significance-of-sun-in-pongal-festival
సూర్యడికి పల్లెసీమలు సమర్పించే కృతజ్ఞతాంజలి
author img

By

Published : Jan 10, 2021, 3:36 PM IST

మనిషిలోని, మహిలోని చీకట్లను పారదోలే వెలుగుల రేడు... జగాన్ని వెలిగించి యుగాన్ని నడిపించే లోకబాంధవుడు...తన ఉషా కిరణాలతో సమస్త జీవకోటినీ చైతన్యవంతం చేసే ప్రత్యక్ష దైవం... ఆ సూర్యనారాయణుడు. శాస్త్రవేత్తల కళ్లతో చూస్తే- అనంత విశ్వంలో ఉన్న లెక్కలేనన్ని నక్షత్రాల్లో ఒకానొక నక్షత్రం. ఆరాధనాభావంతో చూసేవారికి- సప్తాశ్వరథారూఢుడై భూమికి రక్షణ ఛత్రం పట్టే కర్మసాక్షి. ఆయన మకర రాశిలోకి ప్రవేశించే సందర్భం యావత్‌ మానవాళికీ పర్వదినం. ఆదిత్యుడి అస్తిత్వానికీ, అలుపెరగని గమనానికీ ఎన్నెన్నో అర్థాలు చెబుతున్నాయి పురాణాలు. మన పండుగలలో ఒక్క సంక్రాంతి మాత్రమే సౌరగమనాన్ని అనుసరించ జరుపుకునే పండుగ. సంక్రాంతి లేదా సంక్రమణం అంటే మారడం అని అర్థం. కాలాలు మారితేనే సృష్టిలోని ప్రాణులన్నిటికీ ఆహారం దొరుకుతుంది. కాలాలు మారాలంటే సూర్యుడి గమనం మారాలి. అందుకే మారే సూర్యగమనం మనకు పండుగైంది. సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారిన ప్రతి సందర్భాన్నీ సంక్రాంతి అనే అంటాం. ఆ పన్నెండు మాస సంక్రాంతుల్లోనూ మకర రాశిలోకి మారే సంక్రాంతి... ఉత్తరాయణ పుణ్యకాలానికి తొలి రోజు కాబట్టి మకర సంక్రాంతి పర్వదినమైంది. ధనుర్మాస వ్రతాన్ని ఆచరించే విష్ణుభక్తులు ఈ సంక్రాంతి రోజునే గోదాకల్యాణం జరిపిస్తారు. రైతులు నాలుగు రోజులపాటు జరుపుకునే పండుగ కాబట్టి పెద్ద పండుగనీ, పెద్దలకు తర్పణం ఇచ్చే పండుగ కాబట్టి పెద్దల పండుగనీ ఎన్ని రకాలుగా చెప్పినా సంక్రాంతి...భోగభాగ్యాల పండుగే. ప్రకృతిని నమ్ముకుని పగలూ రాత్రీ కష్టపడి పండించుకున్న పంటని ఇంటికి తెచ్చుకున్న ఆనందమూ, మిగిలిన ధాన్యాన్ని అమ్ముకోగా చేతికందిన డబ్బుతో ఇతర అవసరాలన్నీ తీర్చుకోవచ్చన్న సంతోషమూ... ఈ పండుగ వేళ కన్పిస్తాయి. అందుకే వాటన్నిటినీ ఇచ్చిన సూర్యుడికి కృతజ్ఞతలు చెప్పుకునే సందర్భమైంది సంక్రాంతి. సూర్యుడిని ఇలా ప్రత్యక్షదైవంగా ఆరాధించే సంప్రదాయం ఇప్పటిది కాదు.

తొలిదైవం సూర్యుడే!

etvbharat-special-story-on-significance-of-sun-in-pongal-festival
తొలిదైవం సూర్యుడే!

మనిషి చరిత్రలో మొట్టమొదట కొలిచిన దైవం- సూర్యుడే. సూర్యారాధనే అత్యంత పురాతన మతం. సింధూ నాగరికత నాటి తవ్వకాల్లో బయటపడిన ‘స్వస్తిక్‌’ ముద్ర సూర్యుడి ప్రతిమేనంటారు. దాదాపుగా ప్రపంచమంతటా ఈ సంప్రదాయం కొన సాగిందనడానికి నిదర్శనం కొన్ని దేశాల్లో ఇప్పటికీ ఉన్న ఆనవాళ్లు. మనిషి నిర్మించిన అత్యంత పురాతన కట్టడంగా పేరొందిన బ్రిటన్లోని ‘స్టోన్‌హెంజ్‌’ సూర్యుడిని ఆరాధించడానికి ఏర్పాటుచేసిన మొట్ట మొదటి పీఠమని చరిత్ర చెబుతోంది. క్రీ.పూ.2500 ఏళ్ల నాటి ఈజిప్టు పిరమిడ్లలో సూర్యారాధనకు సంబంధించిన ఆనవాళ్లు లభించాయి. తమ దేశాన్ని మొట్టమొదట పాలించింది సూర్యుడేననీ ఆ తర్వాత వచ్చినవారంతా ఆయన ప్రతినిధులేననీ ఈజిప్షియన్లు నమ్ముతారు. గ్రీకుల సూర్యదేవుడి పేరు హీలియోస్‌. క్రైస్తవం వ్యాపించక ముందు వరకూ రోమన్లూ సూర్యుడినే ఆరాధించేవారు. ఇక, జర్మన్లూ (సోల్‌), జపనీయులైతే(అమతేరసు) సూర్యుడిని దేవత రూపంలో కొలుస్తారు. జపాను వారి జాతీయ పతాకం మీద ఎర్రని సూరీడే ఉంటాడు. మొత్తంగా ప్రపంచ దేశాలన్నిటా పురాతన నాగరికతలన్నిటిలోనూ తొట్ట తొలి దైవం సూర్యుడే అనడానికి ఇలాంటి ఆధారాలెన్నో కన్పిస్తాయి. ఆహారాన్ని ఇస్తున్నందుకు సూర్యుడికి కృతజ్ఞతలు చెబుతూ పండుగ చేసుకునే ఆచారం ఆనాటి నాగరిక సమాజాల నుంచి గిరిజన తెగలవరకూ అన్నిట్లోనూ ఉండేది. అదే ఆచారాన్ని ఇప్పటికీ వేర్వేరు రూపాల్లో కొనసాగిస్తున్నారు.

పుణ్యకాలం

సూర్యదేవాలయం

సూర్యుడు మకర రాశినుంచి మిథున రాశి వరకూ సాగించే ప్రయాణాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. మిగిలిన ఆరు రాశుల్లో ప్రయాణాన్నీ దక్షిణాయనమంటారు. దక్షిణాయనంలో వర్షాలు కురుస్తాయి. చలిగాలులు వీస్తాయి. వాటన్నిటితో సహజీవనం చేస్తూ మనిషి ఆహారాన్ని పండించుకుంటాడు. మరో పక్క పండుగలన్నీ కూడా ఆ కాలంలోనే వస్తాయి కాబట్టి దాన్ని ఉపాసనా కాలంగా వ్యవహరిస్తారు. అప్పటివరకూ ముంచెత్తిన వానల నుంచీ వణికించిన చలుల నుంచీ తన నులివెచ్చని కిరణాలతో రక్షణ ఛత్రం పట్టిన సూర్యుడిని సాదరంగా సభక్తికంగా స్వాగతించే వేడుకే మకర సంక్రాంతి. ఈ కాలంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు ఉండవు. కాస్త విశ్రాంతి తీసుకుని మరో దక్షిణాయనానికి సిద్ధమవుతారు రైతులు. దక్షిణాయన కాలంలో కష్టపడ్డ మనిషికి ఉత్తరాయణం సుఖపడే కాలం. అందుకే సంక్రాంతి భోగభాగ్యాల పండుగైంది. మనలాగే దేవతలకీ పగలూ రాత్రీ ఉంటాయట. అయితే, వారికి ఒకరోజు మనకి ఏడాది. వైకుంఠ ఏకాదశితో వారికి తెల్లవారుతుందనీ అప్పుడు స్వర్గద్వారాలు తెరుచుకుంటాయనీ తర్వాత వచ్చే ఉత్తరాయణం వారికి పగలు అయితే దక్షిణాయనం రాత్రి అనీ పురాణాలు చెబుతున్నాయి. పగటిపూట మేలుకుని ఉన్న దేవతలు భక్తుల కోరికలు వింటారనీ, ఈ కాలంలో మరణించినవారు నేరుగా స్వర్గానికి వెళ్తారనీ భక్తుల నమ్మకం. అందుకే ఉత్తరాయణం పుణ్యకాలం అయింది. సూర్యుడి మకర రాశి ప్రయాణం పుణ్యకాలమైతే వేదాలు విరాట్‌ స్వరూపుడిగా కొలిచిన భానుడి కథ భక్తులకు స్ఫూర్తి మంత్రం.

మార్తాండుడు!

కాలపురుషుడైన సూర్యుడు మాఘశుద్ధ సప్తమి రోజున జన్మించాడనీ ఆ సప్తమిని రథసప్తమి అనాలనీ రుగ్వేదం చెబుతోంది. బ్రహ్మ పురాణం ప్రకారం అదితి, కశ్యపులు సూర్యుడి తల్లిదండ్రులు. అందుకే సూర్యుడు ఆదిత్యుడూ, కశ్యపాత్మజుడూ అయ్యాడు. అపారశక్తిమంతుడైన బిడ్డని ప్రసాదించమని అదితి సౌరశక్తిని ప్రార్థిస్తే విశ్వమంతా విస్తరించిన తేజస్సునే ఆ తల్లి కడుపున నిక్షిప్తం చేసిందనీ, ఆ వేడికి గర్భవిచ్ఛిత్తి జరిగిందనీ, దైవానుగ్రహంతో ఆ మృతపిండం నుంచి సూర్యుడు ప్రభవించాడనీ అంటారు. అందుకే సూర్యుడికి మృతాండుడు, మార్తాండుడు అన్న పేర్లు వచ్చాయట. ఆ మార్తాండుడి ఏడు గుర్రాల ఏకచక్ర రథానికి సారథి గరుత్మంతుడికి అన్న అయిన అనూరుడు. రెండు కాళ్లూ లేని అనూరుడు అవస్థ పడకూడదనే ఎప్పటికీ దిగాల్సిన అవసరం లేని తన రథానికి సారథిగా చేసుకున్నాడట సూర్యుడు. సూర్యుడికి సంజ్ఞ, ఛాయ, పద్మిని, ఉష అని నలుగురు భార్యలు. యముడు, వైవస్వతుడు, శని, అశ్వనులు పుత్రులు. యమున, తపతి పుత్రికలు. మనదేశంలో సూర్యుడికి దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ ఓ ప్రముఖ దేవాలయం ఉంది. వాటి నిర్మాణం వెనక ఖగోళపరమైన రహస్యాలెన్నో ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని ఆలయం క్రీస్తుపూర్వం నాటిదని చెబుతారు. వరంగల్‌ జిల్లా హనుమకొండలోని వేయిస్తంభాల గుడిలో పూర్వం సూర్య విగ్రహమూ ఉండేదని అంటారు. చక్కని రథాకృతిలో అద్భుతమైన నిర్మాణశైలి గల ఒడిశాలోని కోణార్క్‌ సూర్య దేవాలయం జగత్ప్రసిద్ధం. కాశీ క్షేత్రంలో సూర్యుడు ద్వాదశాదిత్యుడిగా పన్నెండు రూపాల్లో కొలువుదీరాడు. తమిళనాడులో సూర్యనార్‌ కోవిల్‌, అసోంలో సూర్యప్రహార్‌, గుజరాత్‌లో మొధేరా, బిహార్‌లో దక్షిణార్క, మధ్యప్రదేశ్‌లో బ్రహ్మణ్య, జమ్ము కశ్మీర్‌లో మార్తాండ, కర్ణాటకలో సూర్యనారాయణ... ఇలా దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ పేరొందిన సూర్యదేవాలయాలు ఉన్నాయి.

జ్ఞానదీపం

సూర్యారాధనకు సంబంధించిన ప్రస్తావన రామాయణ, భారతాల్లోనూ కనిపిస్తుంది. సాక్షాత్తూ రఘురాముడే ఇన వంశతిలకుడు. రామరావణ యుద్ధ సమయంలో అగస్త్యుడు రాముడికి బోధించిన మంత్రాలే ‘ఆదిత్య హృదయం’. సూర్యుడే జగత్తు సృజనకు మూలమని చెప్పే ఈ స్తోత్రంలో సూర్యుణ్ణి త్రిగుణాత్మధారుడిగా సంబోధించారు. జయాయ జయ భద్రాయ... అంటుంది ఆదిత్య హృదయం. బాహ్య ప్రపంచాన్ని వెలిగించడంతో పాటు, అంతరంగంలో ఆవరించిన అజ్ఞాన అంధకారాన్ని తొలగించే జ్ఞానదీపం సూర్యబింబం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆత్మలకు మూలస్థానం సూర్యమండలమేనట. సూర్యుడిని పండుగా భావించి మింగేయ బోయిన చిన్నారి హనుమంతుడికి గురువు సూర్యుడే. ఇక భారతానికి వస్తే దూర్వాస మహాముని నుంచి మంత్రోపదేశం పొందిన కుంతికి ముందుగా గుర్తొచ్చింది సూర్యుడే. తన భక్తుడైన సత్రాజిత్తుకు శమంతకమణినీ, వనవాస కాలంలో ధర్మరాజుకు అక్షయపాత్రనీ ఇచ్చి కాపాడింది సూర్యుడే. గాయత్రీ మంత్రంలోని బీజాక్షరాలన్నీ సూర్యమండలంలో కేంద్రీకృతమై ఉంటాయని రుగ్వేదం చెబుతోంది. గాయత్రిని సావిత్రి అనీ, సూర్యుడిని సవిత్రుడనీ పిలుస్తారు. అందుకే సూర్యుణ్ణి ‘సవిత్రు మండల మధ్యవర్తీ నారాయణా’ అని పూజిస్తారు. బీజాక్షర కేంద్రం నుంచి ఉద్భవించి రోదసిలో ఎల్లెడలా వ్యాపిస్తున్న కిరణాలు ప్రాణికోటికి తేజస్సునూ ఓజస్సునూ అందజేస్తాయి. అందుకే భాస్కరుడు ఓజస్కరుడై ప్రాణికోటికి జీవాధారమయ్యాడు.

ప్రత్యక్షదైవం

యుగయుగాలుగా నిర్విరామంగా సాగుతున్న ఆహారచక్రానికి ఆధారభూతం... సూర్యనారాయణుడు. ఆయన లేనిదే భూమి లేదు, జీవకోటి లేదు. ప్రాణిలోని పంచభూతాలకు కారకుడు సూర్యుడు. అందుకే సూర్యుణ్ణి ప్రత్యక్ష దైవమంటారు. త్రిమూర్తి స్వరూపుడైన రవిని ఉదయాన బ్రహ్మగా, మధ్యాహ్నం శివుడిగా, సంధ్యలో విష్ణువుగా స్మరిస్తారు. తూర్పున భానుడు ఉదయించగానే పశువులూ పక్షులూ మానవులతో సహా మొత్తంగా ప్రాణులన్నీ పరవశిస్తాయి. ఆ కిరణాల నులివెచ్చని స్పర్శ శరీరంలో వేడి పుట్టిస్తుంది. శక్తిని ఇస్తుంది. నిద్రాణస్థితిలో ఉన్న ప్రాణికోటిలో అంతర్యామిగా మేలుకొని ఉన్న శక్తే సూర్యుడు అంటుంది ఆదిత్య హృదయ స్తోత్రం. సకల ప్రాణులకూ సూర్యుడి అవసరం ఉంది. అందుకే ఆయనని ప్రత్యక్ష నారాయణుడని కీర్తించి పూజిస్తోంది మానవాళి. సూర్యోదయం ప్రాణుల్ని నిద్రలేపి కర్తవ్యోన్ముఖులను చేస్తే, సూర్యాస్తమయం అలసిన జీవకోటిని విశ్రాంతి తీసుకోమని సేదతీరుస్తుంది. విశ్రమించని సూర్యుడి ప్రయాణం మనిషికి ఆదర్శం. లక్ష్యం సిద్ధించేవరకూ విశ్రమించకూడదని చెబుతుంది. చల్లబడి పడమటి కొండల్లో వాలిన ఆ సూరీడే మర్నాడు మళ్లీ సరికొత్త తేజస్సుతో ఉదయించి ప్రాణుల్లో నూతనోత్సాహాన్ని నింపుతాడు. ప్రతి రోజూ ప్రభాత సూర్యుడిలా వెలుగొందమని మనిషికి ప్రేరణనిస్తాడు.

వైద్య నారాయణుడు

చైతన్య ప్రదాతా శక్తిశాలీ అయిన సూర్యుడిని ఉపాసించడం వల్ల ఆయురారోగ్యాలు సమకూరుతాయనీ, సమస్త జీవజాలం రోగబాధల్ని నివారించగల వైద్యుడు సూర్యుడేననీ నమ్మకం అనాదిగా ఉంది. చర్మసంబంధ బాధలూ, రక్తహీనత వంటి వ్యాధులకు సూర్యకిరణ చికిత్స నివారణోపాయమని నేటి వైద్యులూ చెబుతున్నారు. సూర్యుడు సకలవిధ కాలుష్య నిర్మూలకుడు. ఆ కిరణాల వేడి వల్లే భూమి మీద మనిషి సృష్టిస్తున్న వ్యర్థాలన్నీ నాశనమై అనారోగ్యాలకు అడ్డుకట్ట పడుతోంది. ఆ కిరణాల వేడి వల్లే నీరు ఆవిరై మళ్లీ వర్షంగా మారి ధరణిని సస్యశ్యామలం చేస్తూ ప్రాణికోటికి ఆహార భిక్ష పెడుతోంది. సృష్టిలోని సకల ఓషధులూ సూర్యప్రభావం వల్ల శక్తిమంతమై మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాయి. ప్రభాత సూర్యుడికి ఎదురుగా నిలిచి నమస్కరించే ఆచారం మనది. ‘నమస్కార ప్రియో భానుః అభిషేక ప్రియో శివః’ అంటుంది వేదం. శివుడు అభిషేకప్రియుడైనట్లు సూర్యుడు నమస్కార ప్రియుడట. బాలభానుడి కిరణాలు నేరుగా శరీరానికి తాకేవిధంగా సాగించే యోగ ప్రక్రియ మనసునీ, శరీరాన్నీ ఉత్తేజంగా ఉంచుతుంది. ఆది శంకరాచార్యులు ప్రతిపాదించిన ఆరుమతాలలో (శైవం, వైష్ణవం, శాక్తేయం, గణాపత్యం, స్కాందం, సౌరం) సౌరం అంటే సూర్యోపాసనే. సూర్యారాధన ఆత్మశక్తిని రెట్టింపు చేస్తుంది. మనోబలాన్ని పెంచి, వ్యాకులతని దూరం చేస్తుంది. ‘ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్‌’ అన్నదీ అందుకే. సూర్యారాధన వల్ల జ్ఞానం, సద్గుణం, వర్ఛస్సు, బలం, ధనం, సంతానం, పాపనాశనం, ఆయుర్‌వృద్ధి, సకల రోగనివారణ, సర్వ బాధావిముక్తి పొందవచ్చునని చెబుతున్నాయి వేదాలు. వేకువ వేళ బాలాదిత్యుడిగా, మధ్యాహ్నం మార్తాండునిగా, సాయంత్ర సమయాన మణిదీపంలా మెరిసిపోయే దినకరుడు మనం చేస్తున్న పాప పుణ్యాలకు ప్రత్యక్ష సాక్షి. ఆ స్వామి వల్లే మానవ జాతిలో పాపభీతి, పుణ్యప్రీతి పరిఢవిల్లుతాయన్న నమ్మకంతోనే ప్రపంచమంతా సూర్యుడిని ఆరాధిస్తుంది. ఆహారాన్నీ, ఆరోగ్యాన్నీ అందిస్తూ జీవితాలకు ఆలంబనగా నిలుస్తున్నందుకు ‘లోక రక్షామణీ దైవ చూడామణీ ఆత్మరక్షా నమో పాప శిక్షా నమో’
...అంటూ కృతజ్ఞతాంజలి ఘటిస్తుంది.

ఇక్కడ సంక్రాంతి... అక్కడ ఛఠ్‌!

దక్షిణాదిన సంక్రాంతి అనీ పొంగల్‌ అనీ మనం చేసుకుంటున్న పండుగనే పంజాబ్‌లో లోహ్రీ, అసోంలో బిహు అంటారు. చలిమంటలు వేసి సూర్యుడిని స్తుతిస్తూ పాటలు పాడతారు. బిహార్‌, జార్ఖండ్‌, యూపీ, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల్లో ప్రజలు కార్తిక మాసంలో ఛఠ్‌ పండుగ జరుపుకుంటారు. దీపావళి తర్వాత షష్ఠినాడు మొదలై నాలుగు రోజులు సాగే ఈ వేడుకల్లో నదీస్నానం చేసి ఉదయమూ సాయంత్రమూ సూర్యుడికి అర్ఘ్యమిస్తారు. నిష్ఠగా ఉపవాసాలు ఉంటారు. మట్టి పాత్రల్లో పాయసం చేసి సూర్యుడికీ ఆయన ధర్మపత్ని ఉషకీ నైవేద్యం పెడతారు. పండుగ మూడోరోజున వెదురు బుట్టల్లో పండ్లు తీసుకెళ్లి సూర్యుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరిస్తారు. రాత్రి పూట పంచభూతాలకు ప్రతీకలుగా అయిదు చెరుకుగడలతో వేసిన పందిరి కింద దీపం పెట్టి సంగీత నృత్యాలతో ఆరాధిస్తారు. చివరి రోజున భూమాతకు కృతజ్ఞతలు చెబుతారు. వనవాసానంతరం సీత ఛఠ్‌ వ్రతం చేసిందనీ, ద్రౌపదితో కలిసి పాండవులు ఛఠ్‌ పూజ చేసినందుకే వారికి రాజ్యం తిరిగి లభించిందనీ అక్కడివారు కథలుగా చెప్పుకుంటారు.

విశేషాల సూరీడు!

సూర్యోదయమూ సూర్యాస్తమయాల మధ్య రోజుల్ని లెక్కపెట్టుకుంటాం మనం. కానీ నెలల తరబడి అసలు దినకరుడే కనబడని ప్రాంతాలూ, అర్థరాత్రి అయినా అస్తమించని దేశాలూ ఉన్నాయి. అవే కాదు, మండే అగ్నిగోళంగా కనిపించే మార్తాండుడి శక్తి గురించి మనకు తెలియని విశేషాలు మరెన్నో..!

* ఎరుపు, నారింజ, పసుపు రంగుల్లో కన్పించే సూర్యుడి అసలు రంగు తెలుపు.

* సూర్యగోళం ఎంత పెద్దగా ఉంటుందంటే అందులో ఏకంగా పదమూడు లక్షల భూగోళాలు పడతాయట.

* భూమి తూర్పు నుంచి పడమరకు తిరుగుతున్నట్లే సూర్యుడు పడమర నుంచి తూర్పుకు తిరుగుతున్నాడట. సెకనుకు 220 కి.మీ. వేగంతో తిరిగినప్పటికీ సూర్యుడు ఒక చుట్టు తిరగడానికి 22 కోట్ల సంవత్సరాలపైనే పడుతుందట. పదహారో శతాబ్దం వరకూ సూర్యుడే భూమి చుట్టూతిరుగుతున్నాడని నమ్మేవాళ్లు.

* కాసేపు ఎండలో నిలబడితేనే మనకి చర్మం చుర్రుమంటుంది. 15కోట్ల కి.మీ. దూరాన్ని ఎనిమిది నిమిషాలపాటు ప్రయాణించి వచ్చిన ఆ కిరణాలే అంత వేడిగా ఉంటే సూర్యుడి లోపల ఇంకెంత వేడిగా ఉండాలి... కోటిన్నర డిగ్రీల సెల్సియస్‌ ఉండొచ్చని శాస్త్రవేత్తల అంచనా. హైడ్రోజన్‌, హీలియం వాయువులు మండుతున్నందువల్లే ఆ వేడి.

* మనదాకా చేరుతున్న సౌరశక్తి నలభై శాతమే. మిగిలినదంతా భూవాతావరణం వల్ల ఆవిరైపోతోంది.

* ఒక సెకనుకి సూర్యుడి నుంచి వెలువడే శక్తి వెయ్యి కోట్ల అణుబాంబులకు సమానం.

* ఒక గంట సూర్యకాంతిని పూర్తిగా ఉపయోగించుకుంటే ప్రపంచానికి ఏడాదికి సరిపడా ఇంధనం లభిస్తుంది.

* మనమంటే భూమధ్య రేఖకి దగ్గరగా ఉన్నాం కాబట్టి ఏడాది పొడుగునా సూర్యుడు కనిపిస్తాడు. పగలూ రాత్రీ కచ్చితంగా ఓ లెక్క ప్రకారం సాగుతాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో నెలల తరబడి సూర్యుడు కన్పించడు. ఆర్కిటిక్‌ ధ్రువానికి దగ్గరగా ఉన్న ఉట్కియావిక్‌లో నవంబరు మూడో వారంలో కనిపించిన సూర్యుడి పునర్దర్శనం మళ్లీ జనవరి మూడోవారంలోనే.

* ఐస్‌లాండ్‌, స్వీడన్‌, ఫిన్‌లాండ్‌లలోని కొన్ని ప్రాంతాల్లో అయితే వేసవి కాలం అర్ధరాత్రి పన్నెండు దాటాకే సూర్యాస్తమయం అవుతుంది. మళ్లీ నాలుగున్నరకల్లా భళ్లున తెల్లారిపోతుంది.

* నార్వేలోని స్వాల్‌బోర్డ్‌లో మే- జులై నెలల మధ్య ఏకంగా 76 రోజుల పాటు అసలు సూర్యుడు అస్తమించడు. అలాస్కాలోనూ అంతే. అక్కడ మూడునెలల పాటు ఒకేతీరున ఎండకాస్తుంది. వాచీ చూసుకుని పగలూ రాత్రీ లెక్కలేసుకుని పడుకోవాలే తప్ప ముసిరే చీకట్లు పడుకోమని గుర్తుచేసే ప్రసక్తే ఉండదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.