ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం గొర్రెల తాడు తండా వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్.. కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీ కొట్టింది. ఆటోలో 15 మంది కూలీలు ఉండగా.. వారిలో నాగలక్ష్మి (27) మృతి చెందింది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి.
నాగలక్ష్మి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని టాక్టర్ యజమాని ఇంటి ముందు ఉంచి మృతురాలి బంధువులు, గ్రామస్థులు నిరసన తెలిపారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. నాగలక్ష్మి బంధువులు టాక్టర్ యజమాని ఇంట్లో వస్తువులను ధ్వంసం చేశారు.
పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడం వల్ల పోలీసులు రంగప్రవేశం చేసి.. నిరసనకారులను చెదరగొట్టారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం వల్ల ఆందోళన విరమించారు. అలాగే ప్రమాదంలో గాయపడిన బాధితులకు నష్టపరిహారం ఇస్తామని ట్రాక్టర్ యజమాని చెప్పడం వల్ల గొడవ సద్దుమణిగింది.
ఇదీ చదవండి: తంటికొండ ఆలయం వద్ద ప్రమాద దృశ్యాలు.. సీసీ కెమెరాలో..