కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వన్నారం యువకుడు గొల్లె సారయ్య ద్విచక్రవాహనంపై నుంచి పడి మృతి చెందిన ఘటనపై బంధువులు ఆందోళనకు దిగారు. ఆదివారం రాత్రి వన్నారం శివారులో బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తుండగా పోలీసులు చేరుకొని అతని చరవాణిని తీసుకెళ్లారు. దీనితో పోలీసుల వాహనాన్ని అనుసరిస్తూ గొల్లె సారయ్య ద్విచక్రవాహనంపై వెళ్లాడు. రైల్వే ట్రాక్ సమీపంలో బైక్ పై నుంచి పడి మృతి చెందాడు. మృతుని బంధువులు పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు.
తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తరలించమని ఆందోళన చేశారు. కరీంనగర్ గ్రామీణ ఏసీపీ విజయ సారథి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అర్ధరాత్రి వరకు మృతుని బంధువులు ఆందోళన కొనసాగింది. రామడుగు మండలం వన్నారం గ్రామానికి చెందిన గొల్లె సారయ్య పెయింటర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని హఠాన్మరణంతో భార్య అంజలి పిల్లలు సహస్ర, టోని, సుహాసినిల రోదనలు పలువురిని కలచి వేశాయి.
ఇవీ చూడండి: ప్రైవేటు ఆస్పత్రి నిర్వాకం... ఆక్సిజన్ అందక బాలింత మృతి