భార్యా, పిల్లలకు దూరంగా ఉండటం వల్ల మనస్తాపం చెంది నందన్ సింగ్ అనే కార్మికుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌లో జరిగింది. బిహార్ జోధ్‌పూర్ జిల్లా కేశవన్ గ్రామానికి చెందిన నందన్ కుమార్ సింగ్ ఐదు నెలల క్రితం బతుకు తెరువు కోసం పటాన్ చెరు మండలం ఇస్నాపూర్‌కు వచ్చాడు. స్థానికంగా ఉన్న అరబిందో పరిశ్రమ ఐదో యూనిట్లో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు.
అయితే భార్యా పిల్లలకు దూరంగా ఉండటం వల్ల మనస్తాపం చెంది తాను ఉంటున్న గదిలో స్నేహితుడు లేని సమయం చూసి ఇనుప చువ్వకు రుమాలుతో ఉరివేసుకున్నాడు. అదే గదిలో ఉంటున్న వినీత్ కుమార్ వచ్చేసరికి వేలాడుతూ కనిపించడంతో ముత్తంగి గ్రామం డీఎన్ కాలనీలో ఉంటున్న మృతుడి సోదరుడు చందన్ కుమార్ సింగ్‌కు సమాచారం ఇచ్చాడు. నందన్ సింగ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్ చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చందన్ సింగ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: అంబులెన్స్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు దుర్మరణం