యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో సంధ్యారాణి అనే వైద్యురాలు తనకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టింది. ఇరవై ఏళ్ళుగా వైద్యురాలిగా పనిచేసే తాను భర్త చేతిలో మోసపోయినట్లు తెలిపారు. ఆస్పత్రిని పర్యవేక్షించే మాదాసు సతీశ్‌ను 2001లో వలిగొండ మండలం వేముల కొండలో వివాహం చేసుకున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పుడు తను ఎవరో తెలియదని సతీశ్ అంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
"ఈ పెళ్లికి నా వైపు బంధువులందరూ హాజరైయ్యారు. ఫోటోలు ఉన్నాయి. నాతో అప్పులు చేయించి, ఆస్తులు కొన్నాడు. వాటి వడ్డీని నాతో కట్టిస్తున్నాడు. ఇప్పటికీ రూ.నాలుగైదు కోట్ల అప్పులకు వడ్డీలు చెల్లిస్తున్నాను. పెళ్ళి చేసుకున్నట్లు రిజిస్ట్రేషన్ ఉందా? అని ఇప్పుడు అడుగుతున్నాడు. సతీష్ ఇలా అడగటం బాధించింది. నన్ను బెదిరించి మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు."
- సంధ్యారాణి, బాధితురాలు
బాధితురాలు సంధ్యారాణికి తాము అండగా ఉంటామని మహిళ సంఘం నాయకురాలు సంధ్య తెలిపారు. భర్త సతీశ్ దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. సతీశ్ తరఫు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడితే కేసులు పెడతామని మహిళా సంఘం నాయకురాలు సంధ్య హెచ్చరించారు.
ఇదీ చదవండి: ఆమె ఇంటిముందు మృతదేహం.. చనిపోయాడా, చంపేశారా?