ములుగు జిల్లాలో ఇద్దరు మావోయిస్టు మిలీషియా సభ్యులను వెంకటాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని సోడి కొస, పోడియం మూడాలుగా గుర్తించారు. వీరిద్దరూ వెంకటాపురం-వాజేడ్ ఏరియా మావోయిస్టు కమిటీ సెక్రటరీ సుధాకర్‌కు ప్రధాన అనుచరులుగా తేలిందని ఏఎస్పీ గౌస్ ఆలం వెల్లడించారు. 2019 నుంచి నేటి వరకు మావోయిస్టు కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. గతేడాది అక్టోబర్‌లో తెరాస నేత భీమేశ్వర రావు హత్య కేసులో కూడా ప్రధాన పాత్ర పోషించారని వెల్లడించారు.
"మండలంలోని తడపాల, చెలిమేల అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తుండగా కొంత మంది మావోయిస్టులు తారసపడ్డారు. వారిలోకొంత మంది పారిపోగా.. బ్యాగులు ఉండటంతో వీరిద్దరూ పారిపోలేకపోయారు. పోలీసులపై కత్తులతో దాడి చేయడానికి ప్రయత్నించారు. ప్రతిఘటించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాం".
-- ఏఎస్పీ గౌస్ ఆలం
వీరి వద్ద నుంచి కార్డెక్స్ వైర్, ఎలక్ట్రికల్ 210 మీటర్లు సిల్క్ వైర్లు, బ్యాటరీలు, విల్లంబు, బాణాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: అసహజ బంధానికి పెద్దలు నిరాకరణ.. యువతి బలవన్మరణం