కరోనాతో భర్త మృతి చెందడంతో... ఆ బాధను జీర్ణించుకోలేని భార్య ఆత్మహత్య చేసుకుంది. పంజాగుట్ట పీఎస్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలో ఈ విషాదం చోటుచేసుకుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగైన పవన్ కుమార్‌కు 8 రోజుల క్రితం కరోనా సోకింది. ఆ తర్వాత తన తండ్రి విజయ్ కుమార్‌కు కరోనా సోకింది. ఇద్దరూ ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 6న విజయ్ కుమార్ మృతి చెందాడు.
భర్త కరోనాతో మృతి చెందడం... కుమారుడికి కరోనా సోకడంతో మనోవేదనకు గురైన నర్మద... ఇవాళ ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పవన్ కుమార్ మరోసారి కరోనా పరీక్ష చేయించుకుని ఇంటికి తిరిగొచ్చే సరికి తల్లి ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. ఆమెను కాపాడే ప్రయత్నం చేసినా అప్పటికే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.