పశ్చిమ బంగాకు చెందిన కిషన్‌దాస్, జర్నాదాస్ దంపతులు... ఏడాది క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చారు. కూలీ పనిచేసుకుంటూ... హైటెక్‌సిటీ ఇనార్బిట్ మాల్ సమీపంలో రహదారి పక్కన గుడిసెలో నివసించేవారు. ఓ రోజు కూలీ పనికి వెళ్లి వచ్చేసరికి తమ రెండేళ్ల రాజ్ కుమార్ దాస్ కనిపించలేదు. చుట్టుపక్కలంతా వెతికినా ఆచూకీ దొరకలేదు. చాలారోజులు వెతికినా ఫలితం లేకపోగా... కరోనా భయంతో సొంత రాష్ట్రానికి వెళ్లిపోయారు. భార్య అజాగ్రత్త వల్లే కుమారుడు తప్పిపోయాడని భర్త కిషన్ దాస్ కోపం పెంచుకున్నాడు. కాపురానికి రావద్దని చెప్పి భార్యని తన తల్లి వద్దే వదిలిపెట్టాడు.
కట్ చేస్తే... బాలుడు తప్పిపోయిన రోజున...
హైటెక్ సిటీ సమీపంలో రహదారి పక్కన ఉన్న పిల్లాడిని అక్కడే పాత బట్టల వ్యాపారం చేసే అరుణ్ చూశాడు. వెంటనే బాలున్ని తీసుకుని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి వెళ్లాడు. సాయి కాలనీలో నివసించే తన మేనమామ యాకూబ్‌కు బాలున్ని అప్పగించాడు. అయితే ఆ పిల్లాన్ని తరచూ కొడుతుండటం వల్ల స్థానికులకు అనుమానమొచ్చి 100 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. స్పందించిన పోలీసులు సీడబ్ల్యూసీ అధికారులతో కలిసి విచారించగా... అసలు విషయం బయటపడింది. బాలున్ని సంగారెడ్డి శిశువిహార్‌కి తరలించారు. అక్రమంగా బాలున్ని అపహరించినందుకు అరుణ్‌తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
డీఎన్ఏ పరీక్షలతో నిర్ధరణ...
సీడబ్ల్యూసీ అధికారుల ఫిర్యాదుతో పటాన్చెరు పోలీసులు కేసు నమోదు చేసి హైటెక్ సిటీ ప్రాంతంలో విచారించారు సదరు కాంట్రాక్టర్‌ను వెతికి.. అక్కడ గుడిసెల్లో ఉండే వారి వివరాలు తెలుసుకున్నారు. కిషన్ దాస్, జర్నా దాస్ దంపతుల కుమారుడే అని నిర్ధరించుకుని సమాచారం ఇచ్చారు. తల్లి జర్నాదాస్ వచ్చిన వెంటనే పోలీసులు... సీడబ్ల్యూసీ అధికారుల వద్దకు తీసుకెళ్లారు. సీడబ్ల్యూసీ అధికారుల సూచన మేరకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహింపజేశారు.
సంగారెడ్డి శివ విహార్‌లో ఉన్న బాలుడు డీఎన్ఏ పరీక్షలో కిషన్‌దాస్, జర్నాదాస్ల కుమారుడు అని తేలింది. సీడబ్ల్యూసీ అధికారుల సమక్షంలో పిల్లాడిని పోలీసులు తల్లికి అప్పగించారు. బాలుడు దొరకటం వల్ల మళ్లీ ఆ తల్లిదండ్రులు కలవనున్నారు. ఇక్కడితో కథ సుఖాంతం కానుంది.