వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం శాఖ పూర్ గ్రామంలో పొలం గట్టు పంచాయతీలో జరిగిన ఘర్షణ ఇద్దరి ప్రాణాలు బలి తీసుకుంది. శాఖాపూర్కు చెందిన శాంతయ్య (56), పరశురాముడికు మధ్య గత కొంత కాలంగా పొలం పంచాయతీ నడుస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం పరశురాముడు.. శాంతయ్య పొలం గట్టును కలుపుకొని విత్తనాలు వేసేందుకు దున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న శాంతయ్య తన పొలం ఎందుకు దున్నావని పెద్ద మనుషుల ముందు పంచాయతీ పెట్టి నిలదీశాడు. దీంతో కోపోద్రిక్తుడైన పరశురాముడు... ముందస్తుగానే తనవెంట తెచ్చుకున్న కత్తితో.. గ్రామస్థులు చూస్తుండగానే శాంతయ్య కడుపులో పొడిచాడు. ఇది చూసిన శాంతయ్య మనవడు రామకృష్ణ (28) అడ్డు వెళ్లగా.. తనపై కూడా వెనకవైపు నుంచి పొడిచాడు.
ఈ ఘటన చూసిన గ్రామస్థులు.. మూకుమ్మడిగా పరశురాముడు వద్ద ఉన్న కత్తిని తీసేసి దేహశుద్ధి చేశారు. శాంతయ్య, రామకృష్ణుడిని.. చికిత్స కోసం పెబ్బేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా మార్గమధ్యలోనే ఇద్దరు మృతి చెందారు. ఈ విషయమై కొత్తకోట సీఐ మల్లికార్జున్ రెడ్డి, పెబ్బేరు ఎస్సై రాఘవేందర్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: యువతి ప్రేమ పెళ్లి.. పరువు కోసం ఆమె భర్త హత్య