వనపర్తి జిల్లా కేంద్రం సమీపంలోని జెర్రిపోతుల మైసమ్మ వాగులో గల్లంతైన డీలర్ గోవిందు, బుచ్చిరెడ్డిల కోసం రెండు రోజులుగా గ్రామస్థులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. బుధవారం మృతదేహాలు లభ్యమయ్యాయి.
ఏం జరిగింది:
సోమవారం సాయంత్రం వనపర్తిలో కురిసిన భారీ వర్షానికి పట్టణ శివారులోని జెర్రిపోతుల మైసమ్మ వాగు ఉద్ధృతంగా ప్రవహించింది. ఈ సమయంలో గోపాల్పేట మండలం ఏదుల గ్రామానికి చెందిన ఐదుగురు ఒకరి చేయి మరొకరు పట్టుకొని వాగు దాటుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఇద్దరు వరదలో కొట్టుకుపోయారు. బుధవారం ఉదయం 11 గంటలకు డీలర్ గోవింద్ (55) మృతదేహం, సాయంత్రం బుచ్చిరెడ్డి మృతదేహాలను బయటకు తీశారు.
గోవిందు మృతదేహం వరదల్లో కొట్టుకుపోయి నల్లచెరువు శివారులోని సెయింట్ థామస్ పాఠశాల వెనుక లభ్యమైంది. బుచ్చిరెడ్డి మృతదేహం వాగులోని ముళ్లపొదల్లో చుట్టుకొని ఉండగా బయటకు తీసినట్లు పోలీసులు పేర్కొన్నారు.