ఆన్‌లైన్ రుణ యాప్‌ల వ్యవహారంలో మరో ముగ్గురిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరుకు చెందిన ఈశ్వర్, మధుసూదన్, సతీశ్ కుమార్ కాల్ సెంటర్లలో మేనేజర్లుగా పనిచేస్తున్నారు. రుణం తీసుకున్న వారికి కాల్ సెంటర్ల ద్వారా ఫోన్లు చేయించి వీరు వేధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 27 కేసులు రుణ యాప్‌లకు సంబంధించిన నమోదయినట్లు సీసీఎస్ సంయుక్త కమిషనర్ మహంతి తెలిపారు.
నిందితులు 42 యాప్‌లు రూపొందించి వాటి ద్వారా రుణాలు అందజేసినట్లు ఆయన చెప్పారు. ఐదు సూక్ష్మ రుణ సంస్థలకు చెందిన 350 బ్యాంకు ఖాతాలను పోలీసులు గుర్తించారు. ఆయా ఖాతాల్లోని 87 కోట్ల రూపాయలను పోలీసులు స్తంభింపజేశారు. రాజేంద్రనగర్, సిద్దిపేట, జగిత్యాల పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఆత్మహత్యకు పాల్పడిన రుణ యాప్ బాధితులు నిందితులు రూపొందించిన యాప్‌లనే వినియోగించినట్లు మహంతి వివరించారు. పోలీసులు బెంగళూరు కాల్‌సెంటర్లపై దాడి చేసిన సమయంలో అక్కడ మూడు వందలకు పైగా సిబ్బంది పనిచేస్తున్నట్లు గుర్తించారు. రుణ యాప్‌ల వ్యవహారంలో ఇప్పటికే 20 మంది అరెస్టయ్యారు.
ఇదీ చదవండి: గంటన్నరలో కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు