పొట్టకూటి కోసం రాతిబండల లోడుతో తమిళనాడుకు వెళ్లిన కూలీలు తిరిగిరాని లోకాలకు వెళ్లారు. రాతిబండలే వారి పాలిట మరణశయ్యలుగా మారాయి. నాలుగు రూపాయలు సంపాదించుకుని వస్తామని చెప్పి ఇంటినుంచి వెళ్లినవారు విగతజీవులుగా వచ్చారు.
ఏపీలోని చిత్తూరు జిల్లా వి.కోట మండల పరిధిలోని వీర గుర్రంతోపునకు చెందిన వరదరాజులు(38), రామతీర్థానికి చెందిన రాము (32), ఏడుచుట్ల కోటకు చెందిన గోవిందరాజులు(34) రాతి బండల లోడింగ్, అన్లోడింగ్ పనులు చేస్తుంటారు. వీరివి నిరుపేద కుటుంబాలు. శనివారం ఉదయం యథావిధిగా తమిళనాడు రాష్ట్రం వేలూరులో రాతి బండలను దించడానికి ఓ వాహనంలో వెళ్లారు. వీరు వెళ్తున్న వాహనం వేలూరు సమీపంలోని అనైకట్ట ప్రాంతంలో అదుపు తప్పడంతో రాతిబండల మీద నిద్రిస్తున్న వారి వాటి కిందపడి అక్కడికక్కడే మరణించారు.
మృతదేహాలతో ధర్నా..
తమిళనాడు రాష్ట్రం వేలూరులో పోస్టుమార్టం అనంతరం ముగ్గురి మృతదేహాలను వి.కోటకు తీసుకొచ్చారు. ఘటన జరగ్గానే రాతిబండలను ఎగుమతి చేసే యజమాని బాబు పరారయ్యాడు. అతని ఇంటి వద్ద మృతదేహాలతో బాధితులు ధర్నా నిర్వహించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు వచ్చి వారికి నచ్చజెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున పరిహారం, బీమా సదుపాయం అందిస్తామని చెప్పారు. మృతదేహాలను వారి వారి ఇళ్లకు తరలించారు.
ఇదీ చదవండి: మాజీ డిప్యూటి మేయర్ ద్విచక్రవాహనంపై దుండగుల దాడి