ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తెనాలిలో ఈనెల 22న జరిగిన చంద్రానాయక్ హత్యకేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హతుడి భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధమే హత్యకు దారితీసినట్లు తెనాలి అదనపు ఎస్పీ లక్ష్మి తెలిపారు. సుల్తానాబాద్‌కు చెందిన చంద్రానాయక్‌కు జ్యోతి భాయితో 15 ఏళ్ల క్రితం పెళ్లైంది. ఆమెకు ఏడాది క్రితం శివనాగార్జున అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీనిపై చంద్రానాయక్‌కు అనుమానం వచ్చి భార్యను, శివను నిలదీశాడు.
విషయం తెలిసిపోయిన చంద్రనాయక్ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు శివ, జ్యోతి. దీనికి జ్యోతి అక్క కుమారుడు సాయి కుమార్ సాయం తీసుకున్నారు. ఈనెల 22న రాత్రి సమయంలో జ్యోతి ఇంటి తలుపులు తీసే ఉంచింది. శివనాగార్జున, సాయికుమార్‌తోపాటు మరో ఇద్దరు కలిసి చంద్రనాయక్ నిద్రిస్తున్న సమయంలో కత్తులతో పొడిచి చంపారు. సాయికుమార్ ఒక్కడే చంద్ర నాయక్‌ను చంపినట్లు జ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె మాటల్లో తేడా గుర్తించిన పోలీసులు.. లోతుగా విచారించి వాస్తవాలు రాబట్టారు.
చంద్రనాయక్‌ను హత్య చేసిన సాయికుమార్, చంపేందుకు కుట్ర పన్నిన జ్యోతితో పాటు సహకరించిన శివను అరెస్టు చేశారు. ఈ కేసులో మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి : బెంబేలెత్తిస్తున్న నేపాల్ ముఠాల వరుస చోరీలు..