మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓ ఆటోలో వెళ్తున్న ఇద్దరు పాతనేరస్థులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా.. పలుచోట్ల దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారని మహబూబాబాద్ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. నిందితుల నుంచి రూ.11 లక్షలు విలువ చేసే 23 తులాల బంగారు, 40 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామానికి చెందిన కూతాటి పరమేశ్, దాసరి సాయిలు, రావిరాల గ్రామానికి చెందిన కూతాటి సంపత్‌లు ముగ్గురు కలిసి పగటి వేళలో రెక్కీ నిర్వహించి తాళం వేసి ఉన్న ఇళ్లలో రాత్రివేళలో చోరీకి పాల్పడినట్లు విచారణలో ఒప్పుకున్నారని ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం ఇద్దర్ని మాత్రమే అరెస్టు చేశామని, మరో నిందితుడు సాయిలు పరారీలో ఉన్నాడని వెల్లడించారు. ఈ ముగ్గురు వ్యక్తులు ఆరుబయట నిద్రించే మహిళల ఒంటిపై ఉన్న ఆభరణాలు దొంగిలించిన ఆరు కేసుల్లో నిందితులుగా ఉన్నారని చెప్పారు. నిందితులను పట్టుకోవడంలో సహకరించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ కోటిరెడ్డి అభినందించారు.