కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ శివారులో గుప్తనిధులు దొరికాయనే సమాచారం కలకలం రేపింది. పట్టణ సమీపంలోని రంగనాయకుల గుట్ట వద్ద రాజిరెడ్డి అనే రైతు తన వ్యవసాయ భూమిని చదును చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
చదును చేస్తుండగా..
జేసీబీ వాహనంతో భూమిని చదును చేస్తుండగా.. ఓ పురాతన కుండ బయటపడింది. ఈ విషయం దావానలంలా వ్యాప్తించటంతో.. స్థానికులు అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పట్టణ సీఐ వాసంశెట్టి మాధవి, ఆర్‌ఐ సతీష్, రెవెన్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మట్టి పాత్రను పరిశీలించారు. రైతుతో మాట్లాడి పురావస్తు శాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు.
గతంలో తవ్వకాలు ..
మట్టి పాత్రను చూసేందుకు స్థానికులు పెద్దసంఖ్యలో తరలి వస్తున్నారు. అక్కడ రైతుకు గుప్త నిధులు దొరికాయనే ప్రచారం జోరుగా సాగుతుంది. దీనిపై స్పందించిన రైతు మట్టి పాత్ర పైభాగం కనబడటంతో పనులు నిలిపివేసి అధికారులకు సమాచారం అందించామని చెప్పాడు. గుట్ట పరిసర ప్రాంతంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు గతంలో జరిగాయనే ప్రచారం కూడా ఉంది.
ఇదీ చదవండి:మంత్రి తలసానిని బర్తరఫ్ చేయాలి: గంగపుత్రులు