ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అంతర్గావ్ సమీపంలోని పెన్‌గంగా నదిలో నాటు పడవ బోల్తా పడింది. ఘటనలో 8 మంది మహిళలు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
మండలంలోని దనోరా, గోముత్రి గ్రామాలకు చెందిన 8 మంది మహిళలు.. మహారాష్ట్రలోని సగదా గ్రామంలో బంధువు అంత్యక్రియలకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కొద్ది నిమిషాల్లో ఒడ్డుకు చేరే సమయంలో పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. ఫలితంగా మహిళలు భయంతో కేకలు వేయటం వల్ల అప్రమత్తమైన పడవ నడిపే గంగపుత్రులు.. వారిని సురక్షితంగా బయటకు తీశారు. ఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పడవలో సామర్థ్యానికి మించి ప్రయాణించటం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని గంగపుత్రులు తెలిపారు.