ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా సదుం మండలం చింతపర్తి వారి పల్లెలో చిన్నారుల మృతి.. కలకలం సృష్టిస్తోంది. గ్రామంలోని నడిమోడుకుంట చెరువులో ఇద్దరు కవల పిల్లల మృతదేహాలు తేలారు. గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించగా... మృతదేహాలను చెరువు నుంచి బయటకు తీశారు. చిన్నారులను ఎవరు చెరువులో పడేసి ఉంటారనే కోణంలో తనిఖీలు చేస్తుండగా... పక్కనే ఉన్న పొదల్లో అపస్మారక స్థితిలో ఉన్న ఓ జంటను పోలీసులు గుర్తించారు.
మహిళ పూర్తిగా అపస్మారక స్థితిలో ఉండగా... ఆమె పక్కనే ఉదయ్ కుమార్ అనే వ్యక్తి కాస్త స్పృహలో ఉన్నట్లు గుర్తించారు. ఉదయ్ ఇచ్చిన సమాచారం మేరకు.. మహిళ పులిచెర్ల మండలం ఈ రామిరెడ్డి పల్లి పంచాయతీకి చెందిన హేమశ్రీగా గుర్తించారు. చెరువులో పడి చనిపోయిన ఇద్దరు పిల్లలను పునీత్, పునర్వి.. ఆమె సంతానంగా నిర్ధారించారు. పిల్లల తండ్రి వెంకటేశ్వర రెడ్డికి ఘటనకు సంబంధించిన సమాచారం అందించారు. ఈ ఘటనకు గల కారణాలు.. పసి పిల్లలను చెరువులో పడేసి చంపేయడానికి దారి తీసిన పరిస్థితులపై.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఏపీ: అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం..