రుణం ఇస్తానంటూ ఆశచూపి ఓ వ్యక్తి నుంచి సుమారు రూ. 14 లక్షలు కాజేసిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో చోటు చేసుకుంది. గుంటూరు హనుమాన్ నగర్‌కు చెందిన ఓ రైల్వే విశ్రాంత ఉద్యోగి.. కుటుంబ అవసరాల నిమిత్తం ఆన్లైన్లో రూ.5 లక్షల రుణం కావాలంటూ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థను సంప్రదించారు. అనంతరం బజాజ్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆదిత్య జైన్ పేరుతో 9163442809 నెంబర్ నుంచి బాధితుడికి ఫోన్ చేశారు. రుణం ఇవ్వాలంటే సంస్థకు ప్రాసెసింగ్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు, ఇతర పన్నులు చెల్లించాలంటూ మొదట రూ.2,500, ఆ తర్వాత రూ.15,300, మరోసారి రూ. 18,900.. ఇలా విడతల వారీగా మూడు బ్యాంకు ఖాతాల్లో మొత్తం 13.92 లక్షలు బాధితుడి నుంచి జమ చేయించుకున్నారు.
మీ సివిల్ స్కోర్ బాగుంది.. ఐదు లక్షలు కాదు 18 లక్షలు రుణం ఇస్తామంటూ బాధితుడి నుంచి 13.92 లక్షలు నిందితులు తమ ఖాతాల్లో జమ చేయించుకున్నారు. అనంతరం నగదు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించగా త్వరలోనే మొత్తం 18 లక్షల 80 వేల 200 వందల రూపాయలు అకౌంట్లో జమ అవుతాయని చెప్పారు. కాలం గడుస్తున్నా డబ్బులు రాకపోయేసరికి తను ఇచ్చిన మొత్తాన్నైనా తనకు ఇవ్వాలని బాధితుడు కోరాడు. అవి కూడా ఇవ్వకుండా.. డబ్బులు కావాలంటే అప్డేట్ చార్జస్ కింద మరో 3,28,400 చెల్లించాలని తెలిపారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలని గుంటూరు నగరంపాలెం పోలీసులుకు ఫిర్యాదు చేశాడు.
ఇవీ చూడండి: దా'రుణ' యాప్‌ల కేసులో మరో నలుగురు అరెస్ట్