సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం మన్సాన్పల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. సొంత బాబాయిని అన్న కొడుకు కత్తితో పొడిచి చంపాడు. జోగిపేట సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం మన్సాన్పల్లి గ్రామానికి చెందిన కిష్టయ్య, రాములు ఇద్దరు అన్నదమ్ములు. వారికి ఎకరం వ్యవసాయ భూమి ఉంది. గత ఏడాది దానిని ఇరువురు పంచుకుని పత్తి పంటను సాగు చేస్తున్నారు. హైదరాబాద్లో ఉండే కిష్టయ్య తన కుమారుడు మురళితో కలిసి శనివారం గ్రామంలో తన పొలం వద్దకు వెళ్లాడు. అప్పటికే పొలం వద్ద పనులు చేసుకుంటున్న తమ్ముడు రాములు వద్దకు వెళ్లాడు. భూమి విషయంలో ఇరువురు అన్నదమ్ములు గొడవ పడ్డారు. నాకు సంబంధించిన భూమిలోకి కొంతవరకు నీవు సాగు చేసుకున్నావని... పైగా నాకు నాసిరకం భూమి ఇచ్చావంటూ కిష్టయ్య తమ్ముడిని నిలదీశాడు.
ఈ క్రమంలో అన్నదమ్ముల మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో రెచ్చిపోయిన కిష్టయ్య కుమారుడు మురళి తన వద్ద ఉన్న కత్తితో బాబాయి రాములుపై దాడి చేసి పొడిచాడు. దీన్ని చూసిన రాములు కొడుకు శ్రీకాంత్ అడ్డు రావడంతో అతనిపై కూడా కత్తితో దాడి చేసి గాయపరిచాడు. దాడిని గమనించిన చుట్టుపక్కల రైతులు అక్కడికి చేరుకోవడంతో కిష్టయ్య, అతని కొడుకు మురళిలు అక్కడ నుంచి పరారైనట్లు సీఐ శ్రీనివాస్ పేర్కొన్నారు. 108 వాహనంలో క్షతగాత్రులను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాములు మృతి చెందినట్లు సీఐ తెలిపారు. మృతుని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: పిడుగు పడి కుమార్తె మృతి.. విషమంగా తండ్రి పరిస్థితి