ప్రముఖ గాయని సునీత పేరును ఉపయోగించుకొని డబ్బులు వసూలు చేస్తున్న ఓ యువకుడిని సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని అనంతరపురానికి చెందిన చైతన్య పాటలు పాడుతుంటాడు. గాయని సునీత అభిమానిగా చెప్పుకుంటూ... సామాజిక మాధ్యమాల్లో పలు కార్యక్రమాలు, చర్చా వేదికలు కూడా నిర్వహించాడు.
లాక్ డౌన్ సమయంలో స్వచ్ఛంద సేవ చేస్తానని తన పేరు చెప్పి పలువురితో డబ్బులు వసూలు చేసినట్లు గాయని సునీత సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనంతపురం వెళ్లి చైతన్యను అదుపులోకి తీసుకొని సైబరాబాద్ తీసుకొచ్చారు. న్యాయస్థానంలో హాజరుపర్చి రిమాండ్ కు తరలించారు. చైతన్య చేసిన మోసాల గురించి తెలుసుకోవడానికి కస్టడీలోకి తీసుకొంటామని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.