ఏపీలోని ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన హర్షవర్ధన్‌కు ఈనెల 8న వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 6న పెళ్లి కుమారుడిపై దాడికి పాల్పడటం కలకలం రేపింది. హర్షవర్ధన్ తండ్రి శ్రీనివాసచారితో కలిసి ఉదయం నడక వెళ్లిన సమయంలో దాడి జరిగింది. తీవ్రగాయాలతో ఉన్న అతనిని బంధువులు ఆస్పత్రికి తరలించారు.
విచారణలో అసలు విషయం..
మొదట ఎవరో ఆగంతకులు దాడి చేసి ఉంటారని అంతా భావించినా.. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. కుమారుడి వివాహం ఇష్టం లేక.. పెళ్లిని వాయిదా వేసేందుకు తండ్రే దాడి చేయించినట్లు తేలింది.
సోదరి కుమార్తెతో కుమారుడి వివాహం చేయాలని శ్రీనివాసాచారి భావించాడు. అయితే హర్షవర్ధన్.. ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకునేందుకు సిద్ధం అయ్యాడు. ఇది ఇష్టం లేక.. వివాహాన్ని వాయిదా వేసే ఉద్దేశంతో కుమారుడిపై దాడి చేసినట్లు పోలీసులు తేల్చారు. మతి స్థిమితం సరిగా లేకే.. తండ్రి దాడి చేసి ఉంటారని కుమారుడు ఫిర్యాదు చేసినట్లు.. పోలీసులు చెప్పడం ఈ కేసులో కొసమెరుపు.
ఇవీచూడండి: రెండు రోజుల్లో వివాహం.. వరుడిపై హత్యాయత్నం!