హైదరాబాద్‌లోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో షీ షీ టీం బృందాలు పోకిరీలపై కొరడా ఝుళిపిస్తున్నాయి. సెప్టెంబరు నెలలో మొత్తం 161 ఫిర్యాదులు వచ్చాయి. మొత్తం 41 కేసులు నమోదు కాగా... వీటిలో 27 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. బస్సు స్టాపులు, షాపింగ్ మాళ్లు, రైల్వే స్టేషన్లు, కళాశాలల ప్రాంతాల్లో ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి.
కూకట్‌పల్లిలో ట్యాషన్ కోసం వచ్చిన మైనర్ బాలిక పట్ల ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. విద్యార్థిని ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అదును చూసి ఉపాధ్యాయుడు అసభ్యకరరీతిలో వ్యవహరించాడు. ఈ క్రమంలో విద్యార్థిని తల్లికి అతన్ని మందలించారు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఉపాధ్యాయుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
మరో కేసులో చందానగర్‌కు చెందిన వివాహిత తన బంధువయిన యువకుడిని నమ్మి చేరదీసింది. అతను మహిళతోపాటు వారి పిల్లలకు మత్తు కలిపిన చాక్లెట్లు తినిపించాడు. వారంతా సృహ కోల్పోగానే... అసభ్యకర ఫోటోలు తీసి ఆమెను 20 లక్షల రూపాయలు ఇవ్వాలని బెదిరించాడు. దీంతో ఆమె ఆందోళన చెంది 70 వేల రూపాయలు ఇచ్చింది. అతని వేధింపులు ఆగకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
పుప్పాలగూడ ప్రాంతంలో మైనర్ బాలిక స్నానం చేస్తుండగా ఓ బాలుడు సెల్ఫోన్లో చిత్రీకరించాడు. గమనించిన బాలిక కేకలు వేయడంతో బాలుడు పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకొని జువెనల్ హోంకు తరలించారు. మరో కేసులో మహిళ పట్ల అసభ్యంగా వ్యవహరించిన క్యాబ్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో క్షమాభిక్ష కింద 141 మంది ఖైదీలు విడుదల