ఈ నెల 11న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ వెల్లడించారు. నిందితుడి నుంచి ఒక కత్తి, బ్లేడ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పేర్కొన్నారు.
ఇద్దరూ పాత మిత్రులే..
మృతుడు రాజేష్ అలియాస్ రాజు , నిందితుడు షమర్ బేగ్ అలియాస్ షమీ బేగ్ ఇద్దరూ పాత మిత్రులేనని ఆయన వివరించారు. ఇద్దరూ కలిసి సినిమా సెట్‌లో వెల్డింగ్ పనులు చేస్తూ జీవనోపాధి పొందేవారన్నారు. వీరిద్దరూ కలిసి ఈ నెల 9న రాత్రి మద్యం కొనుగోలు చేసి ఇందిరానగర్‌లో షమీ బేగ్ గదికి వెళ్లి సేవించినట్లు తెలిపారు.
రాజును అనుమానించాడు..
మరుసటి రోజు ఉదయం షమీ బేగ్ నివాసంలో సిలిండర్‌తో పాటు రూ.900 రూపాయలు కనిపించకపోవడంతో మృతుడు రాజును అనుమానించాడు. అతనిపై పగ పెంచుకుని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 11న రాత్రి 8గంటలకు కృష్ణానగర్ ప్రధాన రహదారిపై గల మెట్రో డివైడర్‌లో కూర్చుని ఉండగా అతనిపై దాడి చేసి తన వెంట తీసుకొచ్చిన కత్తితో రాజును బలంగా పొడిచి చంపాడని డీసీపీ తెలిపారు.