మహబూబాబాద్ జిల్లా గార్ల పోలీస్ స్టేషన్ పరిధిలో లారీ, బొలెరో వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 5 లక్షల రూపాయల విలువైన 200 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు సీజ్ చేశారు.ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి 5 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నారని... వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు.
ఖమ్మంకు చెందిన పగిడి సంగయ్య, గార్లకు చెందిన మనోజ్ కుమార్ జైన్, భీమిశెట్టి నరసయ్య, నగరంకు చెందిన రేషన్ డీలర్ సిద్ధబోయిన రామారావు, శేరిపురంకు చెందిన రేషన్ డీలర్ బానోత్ రమేష్, లారీ డ్రైవర్ అజ్మీరా శ్రీనులను అరెస్టు చేశారు. డోర్నకల్‌కు చెందిన ఎడమకంటి రమేష్, గార్లకు చెందిన మహ్మద్ ఖదీర్, ఖమ్మంకు చెందిన రాకేష్ పరారీలో ఉన్నారని ఎస్పీ తెలిపారు. ప్రజలు, రేషన్ డీలర్ల వద్ద వీరు తక్కువ ధరకు బియ్యాన్ని కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారని వెల్లడించారు. వీరిపై పీడీ యాక్ట్ నమోదు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. వాహనాలను పట్టుకునేందుకు కృషి చేసిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
ఇవీ చూడండి: యాత్రికుల నుంచి నగదు వసూలు చేస్తున్న నకిలీ ఏజెంట్ అరెస్ట్