నకిలీ బంగారం అమ్ముతూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముఠాను భువనగిరి పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ గుంటూరు జిల్లా గోగులపాడుకు చెందిన నాగరాజు, పుల్లారావు, పిడుగురాళ్ల మండలం హస్మత్పేటకు చెందిన లక్ష్మి.. ఓ ముఠాగా ఏర్పడి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని రాచకొండ క్రైం డీసీపీ, యాదాద్రి భువనగిరి జిల్లా ఇంఛార్జి డీసీపీ యాదగిరి తెలిపారు.
భువనగిరిలో కూరగాయలు అమ్మే వ్యక్తి వద్దకు తక్కువ డబ్బులకు బంగారం ఇస్తామని చెప్పి వీరు నమ్మబలికారు. కొంత అసలు బంగారం ఇచ్చి చెక్ చేసుకోవాలని సూచించారు. సదురు వ్యక్తి స్వర్ణకారుడి వద్ద పరీక్ష చేయించగా అసలు బంగారం అని తెలిపాడు. తక్కువ ధరకు బంగారం వస్తోందని కూరగాయల వ్యాపారి 40 తులాల నకిలీ బంగారాన్ని రూ. 5 లక్షల 50 వేలకు కొనుగోలు చేశాడు.
అనంతరం 40 తులాలు బంగారాన్ని మరోసారి స్వర్ణకారుడి వద్దకు తీసుకెళ్లి పరీక్ష చేయించగా నకిలీ బంగారమని తేలింది. మోసపోయానని గ్రహించిన వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులు పట్టణ శివారు తుక్కపురం రోడ్డు వద్ద అనుమానాస్పద స్థితిలో తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ యాదగిరి వెల్లడించారు.
వీరి నుంచి రూ. 6.5 లక్షల నగదు, 2.25 కిలోల నకిలీ బంగారం, 3 సెల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలు, ఒక నకిలీ ఆధార్ కార్డు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
ఇదీ చూడండి: కొవాగ్జిన్ టీకాను అన్నిదేశాలకు అందిస్తాం: భారత్ బయోటెక్