ఇసుక మాఫియా విషయంలో పోలీసులకు, స్థానికులకు మధ్య ఘర్షణ నెలకొంది. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ తీగల వంతెన మానేరు నది సమీపంలో పోలీసులకు స్థానికులు ఎదురుతిరిగారు. బొమ్మకల్‌లో ఇసుకను అర్ధరాత్రి తరలిస్తుండగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పలువురు కార్పొరేటర్ల అనుచరులు ఇసుకను తరలిస్తున్నారనే సమాచారం రావడంతో పోలీసులు విచారించారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
రాత్రి విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది మానేరు వాగులోకి వెళ్లి వారిని ఆపే ప్రయత్నం చేయగా ఓ కార్పొరేటర్ కుమారుడు నేనెవరో తెలుసా అంటూ కానిస్టేబుల్‌ను ప్రశ్నించారు. ఇరు వర్గాల వాగ్వాదం వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన ఆకుల రవితో పాటు కొందరు యువకులు కలిసి హోంగార్డు ప్రభాకర్ పై దాడి చేసి పరారయ్యారు. పోలీసులకు ఎదురు తిరిగి విధులకు ఆటంకం కలిగించారనే ఫిర్యాదుతో నిందితులపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఠాణా ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు.
ఇదీ చదవండి: కార్యకర్తలందరూ సైనికుల్లా పనిచేయాలి: బండి సంజయ్