భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో గిరిజన బాలికలను లైంగికంగా వేధించిన ఉపాధ్యాయుడి తరఫున రాజీకి ప్రయత్నించిన అయిదుగురిపై జిల్లా విద్యాశాఖ వేటు వేసింది. డి.సునీల్‌కుమార్ అనే టీచర్ కొంతకాలంగా విద్యార్థినులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నాడు. ఇటీవల ఓ బాలిక తీవ్ర అస్వస్థతకు గురవడంతో కీచక ఉపాధ్యాయుడి దారుణాలు వెలుగులోకి వచ్చాయి.
దీనిపై వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు ఈనెల 14న బాధితుల తల్లిదండ్రులతో చర్చలు జరిపి విషయం బయటకు పొక్కకుండా చూడాలని ప్రయత్నించారు. ఆగ్రహించిన స్థానికులు నిందితునికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. 16న కలెక్టర్ ఎంవీరెడ్డి, ఎస్పీ సునీల్‌దత్ ఆదేశాలతో ప్రబుద్ధుణ్ని అరెస్టు చేశారు.
నిందితుడు డి.సునీల్‌కుమార్ తరఫున రాజీకి యత్నించిన అయిదుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తున్నట్లు శుక్రవారం డీఈవో ప్రకటించారు. సస్పెండైనవారిలో మండలంలోని చింతవర్రె పాఠశాలకు చెందిన టి.శేషగిరిరావు, మైలారం జడ్పీ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు జి.వీరభద్రం, స్కూల్ అసిస్టెంట్లు సీహెచ్.రామయ్య, జె.లింగయ్య, సుజాతానగర్ మండలం కొత్త అంజనాపురం ఎంపీఎస్‌ఎస్ పాఠశాలకు చెందిన పి.శ్రీనివాసరావు ఉన్నారు.
ఇదీ చదవండి: వృద్ధురాలిని హత్య చేసి అదే ఇంట్లో పూడ్చి పెట్టారు!