సిద్దిపేట జిల్లా కొండపాక అభివృద్ధికి నిరంతరం కృషిచేసిన మహోన్నత వ్యక్తి, అజాతశత్రువు.. అందరూ కొండపాక గాంధీగా పిలుచుకునే విశ్రాంత ఉపన్యాసకుడు పేర్ల వీరేశం(78) అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. కొండపాక అభివృద్ధిలో అడుగడుగునా ఆయన కన్పిస్తారు. ఉపాధ్యాయునిగా జీవన ప్రస్థానం సాగించి సిద్దిపేట డిగ్రీ లెక్చరర్‌గా పదవీ విరమణ పొందారు.
ఉపాధ్యాయ వృత్తి అయినా గ్రామంలోని రహదారులు, పురాతన కట్టడాలైన ఆలయాలు, జలాశయాల పునరుద్ధరణ, కొండపాక ప్రాచీన చరిత్ర వెలికి తీయడంలో ఆయన కృషి ప్రజల మనసులపై ముద్ర వేసింది. కోసా (కొండపాక ఓల్డ్ స్టూడెంట్స్ యూనియన్) స్థాపించారు. గ్రామంలోని యువత ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వారిని ఒక్క తాటిపైకి తెచ్చేవారు. ఆయనను విజ్ఞానగనిగా.. నడిచే గ్రంథాలయంగా అభివర్ణించేవారు. నేడు కొండపాకలో రెండు పడక గదుల కోసం విరాళంగా ఇచ్చిన స్థలం ఆయనదే. తమ పెద్ద దిక్కును కోల్పోయామంటూ కొండపాక మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.