మెదక్ జిల్లా రామాయంపేట మండలం డి.ధర్మారంలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తికి అడ్డు వస్తాడనే ఉద్దేశంతో నవీన్ అనే వ్యక్తి ఏడాది వయసున్న తన తమ్ముడిని గొంతు నులిమి చంపేశాడు.
గ్రామానికి చెందిన భూమని పోచయ్య.. భార్య భారతమ్మ 10 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. అనంతరం ఎల్లవ్వ అనే మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. మృతి చెందిన భారతమ్మకు నవీన్ (19) అనే కుమారుడు, మరో కుమార్తె ఉండగా.. ఎల్లవ్వకు ఏడాది వయసున్న వేణు అనే బాబు ఉన్నాడు.
ఎల్లవ్వ కుమారుడంటే నచ్చని మొదటి భార్య కుమారుడు నవీన్.. వేణును చంపుతానని తరచూ బెదిరించేవాడు. ఆదివారం రాత్రి తండ్రి పోచయ్య, నవీన్‌ల మధ్య గొడవ జరగగా.. ఈ క్రమంలోనే నవీన్ వేణు గొంతు నులిమి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
కుటుంబ సభ్యులు బాబును ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందాడు. వేణు మృతితో తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రామాయంపేట ఎస్సై మహేందర్ తెలిపారు.
ఇదీ చదవండిః కత్తులతో దాడిచేసి యువకుడి దారుణ హత్య