నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని రవీంద్రనగర్‌లో దారుణం జరిగింది. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి తాగేందుకు కుటుంబసభ్యులు డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన జాదవ్ నాందేవ్ అనే వ్యక్తి మద్యం మత్తులో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై రాం నరసింహరెడ్డి తెలిపారు.
తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని..
మృతుడు కొద్ది రోజులుగా ఇంట్లోనే నుంచి డబ్బులు తీసుకెళ్లి మద్యం సేవించేవాడు. గత రాత్రి మద్యం సేవించేందుకు డబ్బులు అడగితే కుటుంబ సభ్యులు ఇవ్వలేదు. రాత్రి ఇంట్లో అందరూ నిద్రించిన తర్వాత గ్రామంలోని తన పంటపొలంలో మద్యం సేవించి అదే మత్తులో పురుగుల మందు తాగాడు. ఈరోజు ఉదయం ఇంట్లో తండ్రి కనిపించకపోవడంతో అతని చిన్న కొడుకు జాదవ్ రామ్ పొలం వద్దకు వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు. వెంటనే నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.