నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం బొమ్మకల్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వరికోత యంత్రంలో ధాన్యాన్ని బయటికి తీయబోయి ఓ వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన బొమ్మకంటి ఆంజనేయులు(30) వరికోత యంత్రం డ్రైవర్గా పనిచేస్తున్నాడు.
కోత ముగిసిన తర్వాత రోజులాగే యంత్రం ఇంజన్ ఆపకుండానే అడుగుభాగంలో ధాన్యాన్ని తీసేందుకు డబ్బాలోకి తలపెట్టాడు. అతని తలకు ఉన్న టవల్ మెడకు చుట్టుకోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఇది గమనించిన మరో రైతు కొడవలితో తువాలును కోసి అతన్ని నల్గొండలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించాడు. మృతునికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.