వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ మండలం కడిపికొండ నాగుల చెరువులో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో పల్లపు పూర్ణ అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెనాలికి చెందిన పల్లపు పూర్ణ, అప్పారావు దంపతులు 10 సంవత్సరాల క్రితం బతుకు దెరువు కోసం కడిపికొండకు వలస వచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు. అయితే భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే గురువారం సైతం దంపతుల మధ్య గొడవ జరిగింది. కలత చెందిన పూర్ణ నిన్న రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఈరోజు ఉదయం గ్రామ చెరువులోని చెట్ల మధ్య పూర్ణ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. కుటుంబ సభ్యులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు.
కాజీపేట్ ఏసీపీ రవీంద్ర కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.