భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చింతగుప్ప వద్ద పోలీసులు చేపట్టిన తనిఖీల్లో మావోయిస్టు మిలీషియా సభ్యుడు పట్టుబడ్డాడు. మండలంలోని కొండివాయి గ్రామానికి చెందిన పొడియం జయరామ్గా పోలీసులు గుర్తించారు. అతని వద్ద నుంచి డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్, ఎలక్ట్రికల్ వైరు, బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నారు.
ఈ నెల రెండో తేదీ నుంచి మావోయిస్టులు పీఎల్జీవో వార్షికోత్సవాలకు పిలుపునివ్వడంతో తనిఖీలు ముమ్మరం చేసినట్లు భద్రాచలం ఏఎస్పీ డాక్టర్ వినీత్ వెల్లడించారు. చింతగుప్ప అటవీప్రాంతంలో పోలీసులను చూసి పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఇతనిపై 50కి పైగా ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులు ఉన్నట్లు ఏఎస్పీ పేర్కొన్నారు. మావోయిస్టు సభ్యులు ఎవరైనా లొంగిపోతే వారిపై ఉన్న కేసులన్నీ ఎత్తివేస్తామని ఆయన స్పష్టం చేశారు.