గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్.పి రోడ్లో ఈ నెల 23న సాయంత్రం ఐదు గంటల సమయంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మోండా మార్కెట్లోని జ్యూయలరీ షాప్‌లో పనిచేస్తున్న మహేశ్(25) మల్లేపల్లిలోని సీతారాంబాగ్‌లోని తన ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలో ఆర్.పి రోడ్ వద్ద రోడ్డు దాటుతున్న హైదర్ నగర్లో నివాసముండే సుభాషిని అనే మహిళను ఢీ కొట్టాడు. దీంతో ఆమె రోడ్డుపై పడిపోయింది. స్థానికంగా ఉన్న వారు 100 నంబర్‌కు డయల్ చేయడం వల్ల గాంధీ నగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
ఆమెను చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన మహేశ్‌ను... పోలీసులు స్టేషన్ పిలిపించి అతని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. సాయంత్రం ఏడు గంటలు దాటిన తర్వాత అతని ఇంటికి వెళ్లిపొమ్మని చెప్పారు. అయితే అతను ఇంటికి వెళ్లలేదు.
రోడ్డు ప్రమాదం జరిగిన స్థలంలో అతని ఫోన్ పడిపోయింది. రాత్రి పదిన్నర గంటలకు అతని ఫోన్‌కి మహేశ్ తల్లిదండ్రులు ఫోన్ చేయగా మీ మహేశ్‌కు యాక్సిడెంట్ అయింది గాంధీ ఆసుపత్రిలో ఉన్నాడని చెప్పి ఫోన్ పెట్టేశారు. మరుసటి రోజు కూడా కొడుకు ఇంటికి రాకపోవడం వల్ల మహేశ్ తండ్రి విశ్వంబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ నెల 24న మహేశ్ అదృశ్యమైనట్లు గాంధీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసినప్పటినుంచి పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు.
పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన....
బుధవారం ఉదయం ట్యాంక్ బండ్లో గుర్తు తెలియని మృతదేహం లభించింది. రాంగోపాల్ పేట్ పోలీస్‌లు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని వివరాలు సేకరించగా ఈనెల 23న రోడ్డు ప్రమాదానికి కారకుడైన మహేశ్ అని గుర్తించారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు గాంధీ నగర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి పోలీసుల వేధింపుల వల్లే తమ సోదరుడు ట్యాంక్ బండ్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. వెంటనే తమ సోదరుడు మహేశ్ మృతిపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు.
రోడ్డు ప్రమాదం జరిగిన రోజున మహేశ్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వివరాలు సేకరించి ఇంటికి వెళ్లమని చెప్పినట్లు గాంధీనగర్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు అడిగితే ఫోన్లో ఉన్నాయని... ఆ ఫోన్ తన దగ్గర లేదని చెప్పాడని పేర్కొన్నారు. మృతుడు పోలీస్ స్టేషన్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు నడిచి వెళ్లిన సీసీ ఫుటేజ్ వీడియోను కూడా వారి కుటుంబ సభ్యులకు చూపించినట్లు సీఐ తెలిపారు.