శంషాబాద్ విమానాశ్రయంలో నకిలీ పాస్‌పోర్టుతో వచ్చిన వ్యక్తిని ఆర్జీఐఏ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ పాస్‌పోర్ట్‌పై విదేశాలకు వెళ్లొస్తూ.. హైదరాబాద్‌లో రెన్యువల్ కోసం వచ్చిన కామారెడ్డి జిల్లా రామారెడ్డికి చెందిన గంగావత్ బాలు ఇమ్మిగ్రేషన్ అధికారులకు చిక్కాడు.
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలానికి చెందిన గంగావత్ బాలు(38), విదేశాలలో పనిచేసేందుకు రవీందర్ రతుల పేరుపై 2010లో నకిలీ పాస్ పోర్టు చేయించుకున్నాడు. దాదాపు పదేళ్లలో ఇండియా నుంచి బహ్రెయిన్‌కు ఆరు సార్లు వెళ్లి వచ్చాడు. సెప్టెంబరు 26న ఆరోగ్యం బాగాలేదని అత్యవసర ధ్రువపత్రంతో శంషాబాద్ విమానాశ్రయానికొచ్చాడు.
ఇలా దొరికాడు..
గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ తతంగం పాస్‌పోర్ట్ రెన్యువల్ చేయాల్సి రావడం వల్ల బయటపడింది. ఆగస్టు 15 నాటికి గడువు ముగిసినందున తన పాస్‌పోర్ట్‌ను రెన్యువల్ చేయవలసిందిగా పాస్‌పోర్టు అధికారులను గంగావత్ బాలు దరఖాస్తు చేసుకున్నాడు. అతడు సమర్పించిన పాస్‌పోర్ట్‌లో రవీంద్ర రతుల పేరు ఉండడం.. ఆధార్, పాన్‌కార్డు గంగావత్ బాలు పేరుమీద ఉండడం వల్ల అనుమానమొచ్చిన పోలీసులు నిందితుడిని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు.
ప్రాథమిక విచారణలో గంగవత్ బాలు... తానొక ఏజెన్సీ వద్ద నుంచి పదేళ్ల క్రితం నకిలీ పాస్‌పోర్ట్ తయారు చేసుకున్నానని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చూడండి: కీసర లంచం కేసులో మరో ఐదుగురు అరెస్టు