భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గోదావరి కరకట్ట సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. అనుమానాస్పదంగా నిలిపి ఉంచిన కారును తనిఖీ చేశారు. అందులో 219 కిలోల గంజాయిని గుర్తించి.. స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.33 లక్షల వరకు ఉంటుందని సీఐ వినోద్‌రెడ్డి పేర్కొన్నారు. కారుతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
సులభంగా నగదు సంపాదించవచ్చని చాలా మంది యువకులు ఈ అక్రమ దారిని ఎన్నుకుంటున్నారని సీఐ వినోద్‌రెడ్డి పేర్కొన్నారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి రవాణాను అరికట్టేందుకు భద్రాచలంలోని అన్ని ప్రధాన రహదారుల్లో పగలు, రాత్రి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.