ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో బీటెక్ (ఐటీ) చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో.. తాను టీసీఎస్‌లో హెచ్ఆర్ అని.. బ్యాక్ డోర్ ద్వారా జాబ్ ఇప్పిస్తానని చెప్పి.. రూ. లక్షా 80 వేలు కట్టించుకుని మోసం చేశాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు తగిన న్యాయం చేయాలని కోరుతూ.. బాధితుడు గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు.
ఏం జరిగిందంటే..?
గుంటూరు ఆర్టీసీ కాలనీలో నివాసముంటున్న ఓ యువకుడు విశాఖపట్నంలోని గీతం యునివర్సిటీ బీటెక్ (ఐ.టి) చదివాడు. క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ కాకపోవడం వల్ల హైదరాబాద్‌లోని పంజాగుట్ట ప్రాంతంలో గది అద్దెకు తీసుకుని.. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో తన స్నేహితుడు శివకుమార్ ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం మోర గ్రామానికి చెందిన మండా వెంకట రమేశ్ తండ్రి మంచి వెంకట సత్యనారాయణ శాస్త్రి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను హైదరాబాద్‌లోని టీసీఎస్‌లో హెచ్ఆర్ మేనేజరుగా పని చేస్తున్నానని.. అందులో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ. లక్షా 80వేలు కట్టించుకున్నాడు.
ఆ తరువాత ఉద్యోగం గురించి అడిగితే.. తన పేరు మీద ఫేక్ ఆఫర్ లెటర్, కాల్ లెటర్ పంపినట్లు బాధితుడు చెప్పాడు. ఇదేంటి అని ఆడిగితే ఏదో తప్పు జరిగిందని.. మరో 10 రోజుల్లో చేర్పిస్తానని నమ్మబలికాడు. జాబ్ ఆయన ఇప్పించు.. లేదంటే కట్టిన డబ్బులు అయిన ఇవ్వమని అడిగితే.. డబ్బులు ఇవ్వను, ఉద్యోగం రాదు నీ ఇష్టం వచ్చింది చేసుకో అని అసభ్యంగా మాట్లాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు బాధితుడు.
మరో ముగ్గురిని..
తన లాగానే మరో ముగ్గురు అతన్ని నమ్మి మోసపోయారని.. వారి దగ్గర రూ. 6 లక్షల వరకు వసూలు చేసినట్లు బాధితుడు తెలిపాడు. నిందితుడు శాస్త్రిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరాడు. సోమవారం గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో బాధితుడు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.
ఇదీ చదవండి: కుట్టుమిషన్ల పేరుతో కుచ్చుటోపీ..రూ.15.18 లక్షల మోసం