వనపర్తి జిల్లా చిన్నంబాయి మండలం అమ్మాయిపల్లికి చెందిన వసంత, వీపనగండ్ల మండలం కాల్వరాలకు చెందిన ఆర్ఎంపీ శాంతయ్య, వీపన గండ్లకు చెందిన డ్రైవర్ అశోక్ రెడ్డి... రైల్వే, పోలీసు శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురిని నమ్మించి మోసం చేసినట్టు... వీపనగండ్ల, పెబ్బేరు ఎస్సైలు వహిద్ అలీబేగ్, రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. ఒక్కో ఉద్యోగానికి సుమారు రూ. 3 నుంచి రూ. 6 లక్షల వరకు డబ్బులు వసూలు చేశారు. రైల్వే శాఖలో టికెట్ కలెక్టర్గా ఉద్యోగం చేస్తున్నానని... ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వసంత యువకులను నమ్మించి డబ్బులు వసూలు చేసింది.
2014లో పరిచమైన ఆర్ఎంపీ శాంతయ్యతో తనకు పోలీసు ఉన్నతాధికారులు తెలుసునని... ఎస్సై ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.12లక్షలు వసూలు చేసింది. కొన్ని రోజుల తర్వాత ప్రశ్నించగా... సీఐగా పదోన్నతి వచ్చిందని ఆర్డర్ కాపీతోపాటు యూనిఫాం కూడా ఇచ్చింది. అప్పటికే తన బంధువులైన కొందరికి ఉద్యోగాలు కావాలని డబ్బులు ఇచ్చాడు. కానీ మోసపోయానని గుర్తించి... ఆమెతో చేతులు కలిపాడు.
వీరు తరచుగా అశోక్ రెడ్డి అనే వ్యక్తి కారు తీసుకుని వెళ్లేవారు. మోసాల గురించి తెలిసిన అతను కూడా వీరితో మిలాఖత్ అయ్యాడు. వీరు స్థానికంగానే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలు చేశారు. ఈ క్రమంలో టికెట్ కలెక్టర్ వివిధ రకాల ఉద్యోగాలు ఇప్పిస్తామని రాజేష్ నుంచి రూ. 6 లక్షలు, అనిల్ దగ్గర రూ.4 లక్షలు, శ్రీనివాసులు నుంచి రూ. 2లక్షలు, కొల్లాపూర్ పట్టణానికి చెందిన సుధాకర్ దగ్గర రూ. 2.50 లక్షలు వసూలు చేశారు. వీరందరికీ ఆర్డర్ కాపీని అందించి రెండు నెలలపాటు నెలకు 14 వేలు జీతం కూడా ఇచ్చారు.
జీతం సరే ఉద్యోగాల గురించి నిలదీయగా... ఆమె కనిపించకుండా పోయింది. దీంతో బాధితులు వీపనగండ్ల, పెబ్బేరు ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వసంత ఆర్ఎంపీ శాంతయ్య, డ్రైవర్ అశోక్ రెడ్డి బాగోతం వెలుగులోకి వచ్చింది. అశోక్ రెడ్డి ఇతర మండలాల్లో కూడా కొంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో పెబ్బేరు మండలంలో 26 మంది యువకుల నుంచి రూ.1.30 కోట్లు, వీపనగండ్ల మండలంలో రూ. 26.50 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు.