ఇంట్లో నిద్రిస్తున్న ఐదేళ్ల బాలికను ఓ గుర్తుతెలియని కామాంధుడు ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన సంఘటన బుధవారం తెల్లవారుజామున ఏపీలోని కాకినాడలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గోళీలపేటకు చెందిన పిల్లి రాజుకు ఇద్దరు కుమార్తెలు. రాజు కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బాలిక తల్లి కుటుంబ పోషణ నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటున్నారు. పిల్లలు వారి అమ్మమ్మ, తాతయ్య వద్ద ఉంటున్నారు.
ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న రాజు పెద్దకుమార్తె అయిన ఐదేళ్ల బాలికను అర్ధరాత్రి సమయంలో ఓ కామాంధుడు ఎత్తుకెళ్లాడు. గోళీలపేట శివారు శ్మశానవాటిక వద్దగల తుప్పల్లోకి తీసుకెళ్లి అత్యంత కిరాతకంగా అత్యాచారం చేశాడు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న బాలికను అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి చూసి కుటుంబసభ్యులకు అప్పగించాడు. చిన్నారిని వెంటనే చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
బాలికను పరామర్శించిన జిల్లా ఎస్పీ
జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాలికను జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ పరామర్శించారు. చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని త్వరలోనే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఎస్పీతో పాటు ఐసీడీఎస్ పీడీ విజయలక్ష్మి, మరో అధికారి వెంకట్, ఇతర పోలీసు అధికారులు ఉన్నారు.
ఇదీ చదవండి: రోడ్డు దాటుతుండగా ఢీకొన్న కారు.. ప్రమాదంలో తల్లిబిడ్డ..