నల్గొండ జిల్లాలో జరిగిన అగ్ని ప్రమాదంలో భారీగా పత్తి దగ్ధమైంది. కొండమల్లేపల్లి మండలం ఆంబోతు తండా సమీపంలోని హైదరాబాద్ పత్తిమిల్లులో ఈ ఘటన చోటు చేసుకుంది. జేసీబీ సాయంతో జిన్నింగ్‌మిషన్‌లోకి పత్తిని పంపుతుండగా నిప్పురవ్వలు రావడంతో మంటలు చెలరేగాయి.
ఈ ఘటనలో దాదాపు రూ.40 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. జేసీబీ పళ్లు సిమెంట్ నేలకు రాసుకుని నిప్పురవ్వలు చెలరేగి ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.