సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగులుర్ తండాలో దారుణం చోటుచేసుకుంది. తండాకు చెందిన రమావత్ జీవన్ తన కుమార్తెను హతమార్చిన ఘటనతో ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది.
మద్యానికి బానిసైన జీవన్ కుటుంబ పోషణ భారం కావడం వల్ల తరచూ మనోవేదనకు గురయ్యేవాడు.లాక్డౌన్ వల్ల ముగ్గురు పిల్లలను (ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి) పోషించడం మరింత కష్టంగా మారింది. ముగ్గురిలో ఒకర్ని హతమారిస్తే కొంత ఆర్థిక భారం తగ్గుతుందని జీవన్ భావించాడు. అర్ధరాత్రి సమయంలో.. అమ్మమ్మ పక్కన నిద్రిస్తున్న చిన్న కుమార్తె అవంతిక గొంతుకోసి హత్య చేశాడు.
అనంతరం ఏమీ ఎరగనట్టు చిన్నారికి ఏమైందో చూడండి అంటూ కుటుంబ సభ్యులను లేపాడు. అనుమానం వచ్చిన జీవన్ భార్య రేణుక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తానే గొంతు కోసి కుమార్తెను హత్యచేసినట్లు పోలీసుల వద్ద జీవన్ ఒప్పుకున్నాడు. అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు.