రెవెన్యూ అధికారుల తీరుతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో చివరికి ఉరి వేసుకొని ఉసురు తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం సిరిపురం గ్రామానికి చెందిన అంజయ్య యాదవ్‌కు ఎకరా ముప్పై గుంటల భూమి ఉంది. ఇది అనువంశికంగా వస్తోంది. మూడేళ్ల క్రితం అంజయ్య పేరు మీద కాకుండా ఆ భూమి వేరే పేరు మీదకు మారింది. తన భూమి తన పేరు మీదకు మార్చాలని కోరుతూ అంజయ్య మూడేళ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా మారలేదు.
అప్పుల బాధతో...
అంజయ్యకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అప్పు తీసుకొచ్చి మూడు నెలల క్రితం పెద్దకూతురుకు వివాహం చేశారు. అప్పు తీర్చడానికి ఉన్న భూమిలో కొంత అమ్ముకుందామంటే ఆ భూమి వేరే వారి పేరు మీద ఉంది. విసుగు చెందిన అంజయ్య యాదవ్ ఇంటి ముందు గల వేప చెట్టుకు గురువారం అర్ధరాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
ఇప్పటికైనా అధికారులు భూమిని తమ పేరు మీదకు మార్చుతారా అంటూ అంజయ్య యాదవ్ భార్య సుగుణ రోదించిన తీరు స్థానికులను కన్నీరు పెట్టించింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై శ్రీనివాస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: యాప్ రుణాల దందా.. కుమారుడిని పట్టించిన ఏఎస్‌ఐ