మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ స్వాతి లక్రా పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్బుక్ ఖాతా తెరిచారు. ఆ ఖాతా నుంచి పలువురికి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపించారు. దాదాపు 50 మంది ఆ రిక్వెస్ట్‌ను అంగీకరించారు. ఈ ఫేస్బుక్ ఖాతా విషయాన్ని కొంతమంది స్వాతి లక్రా దృష్టికి తీసుకెళ్లగా.. ఆమె నకిలీ ఖాతాగా తేల్చారు.
తన అసలు ఫేస్బుక్ ఖాతా నుంచి సందేశం పంపారు. తన పేరుతో పంపే ఫ్రెండ్ రిక్వెస్ట్, సందేశాలను అంగీకరించొద్దని సూచించారు. నకిలీ ఫేస్బుక్ ఖాతా నుంచి వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను వెంటనే తొలగించాలని కోరారు.
మరోవైపు స్వాతి లక్రా తన ఫేస్బుక్ ఖాతాలో స్పందించిన వెంటనే.. సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్బుక్ ఖాతాను తొలగించారు. ఈ నకిలీ ఖాతాపై స్వాతి లక్రా సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.